calender_icon.png 6 November, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాతావరణ మార్పులతో పంటలకు నష్టం

06-11-2024 01:43:01 AM

చిరుధాన్యాల సాగుతో ఆహార కొరతను అధిగమించొచ్చు 

అఖిల భారత చిరుధాన్యాల జాతీయ సదస్సులో వక్తలు

హాజరైన 10 రాష్ట్రాలకు చెందిన 15 ఎన్జీవోల ప్రతినిధులు

సంగారెడ్డి, నవంబర్ 5 (విజయక్రాంతి): వాతావరణ మార్పులతో పంటల సాగులో నష్టాలు కలుగుతున్నాయని, భవిష్యత్‌లో ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ స్వాతి తివారి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో చెల్లండ్ల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం అఖిల భారత చిరుధాన్యాల నాలుగో జాతీయ సదస్సు నిర్వహించారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 15 ఎన్జీవోల ప్రతినిధులు, 100 మంది మహిళా రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతి తివారి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులు, పోషకాహార భద్రతను గుర్తించేందుకు ప్రయ త్నం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వర్షాలు సరైన సమయంలో కురవ కపోవడం.. పంటల కోతల సమయం లో పడుతుండడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుం దన్నారు. చిరుధాన్యాల్లో అధిక పోషకాలు ఉంటాయని, దీంతో ప్రతి ఒక్క రూ వాటిని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఎంతో ఉందన్నారు. అనంతరం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ.. దేశంలో చిరుధాన్యాలను సాగు చేసేందుకు అనుకూలమైన భూములు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు చేసి పంటలపై పరిశోధనలు చేస్తుందని పేర్కొన్నారు. అధిక పోషకాలు ఉన్న చిరుధాన్యాలపై పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. చిరుధాన్యాలను ప్రోత్సహించే సంఘాలను రిజి స్టర్ చేసేందుకు తమ సహకారం ఉం టుందని తెలిపారు. డీడీఎస్ (దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ) మహిళా రైతులు చిరుధాన్యాలు సాగు చేసేందుకు ముందుకు రావ డం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్‌రావు మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో మంచి పోషకాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

భవిష్యత్‌లో చిరుధాన్యాలకు డిమాండ్

చిరుధాన్యాలతో ఆహార కొరతను అధిగమించొచ్చని, ప్రస్తుతం ప్రపంచ దేశాలు చిరుధాన్యాల సాగు వైపు చూస్తున్నాయని మహిళా రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల సాగుపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోని 21 స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగు కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ వస్తుందన్నారు. సదస్సులో సంగారెడ్డి జిల్లా నాబార్డు డిప్యూటీ మేనేజర్ కృష్ణ తేజ, డీడీఎస్ డైరెక్టర్ రుక్మాణిరావుతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.