30-03-2025 12:09:05 AM
మహిళ మాటలు నమ్మి మోసపోయిన దల్జీత్ సింగ్..
ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు..
సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
నోయిడా: సైబర్ క్రైమ్ వలలో చిక్కుకొని బాధితులు డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా డేటింగ్ యాప్ ట్రాప్‌లో చిక్కుకొని రూ. 6.3 కోట్లు కోల్పోయిన ఘటన నోయిడా పరిధిలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ ఢిల్లీకి చెందిన కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు గతంలోనే విడాకులయ్యాయి. దీంతో ఒక డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ తయారు చేసి మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దల్జీత్‌కు ‘అనిత’ అనే మహిళ పరిచయమైంది. తనది హైదరాబాద్ అని చెప్పుకుంది. ఇద్దరి మధ్య కొన్నాళ్లు మాటలు కొనసాగడంతో మంచి స్నేహితులయ్యారు.
దల్జీత్ తనను పూర్తిగా నమ్ముతున్నాడని గ్రహించిన మహిళ.. తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో సంపాదించొచ్చు అని ఆశ చూపింది. మొదట్లో లాభాలు రావడంతో అనితను పూర్తిగా నమ్మిన దల్జీత్ తన దగ్గర ఉన్న 4.5 కోట్ల సేవింగ్స్‌తో పాటు బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకున్న కొంత మొత్తం కలిపి 6.3 కోట్లు విడతల వారీగా చెల్లించాడు. వాటిని తన ఖాతాల్లోకి తిరిగి మళ్లించేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. దీంతో మోసపోయినట్టు గుర్తించిన దల్జీత్ నోయిడా సెక్టార్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.