న్యాయం కోసం వెళ్తే భూమిని నొక్కేసిన వైనం
కోట్ల విలువజేసే భూమిని అగ్గువకే లెక్కకట్టే యత్నం
నాగర్‌కర్నూల్, నవంబర్ 9 (విజయక్రాంతి): భూ పంపిణీలో గొడవపడిన ఓ కుటుంబం న్యాయం కోసం ఓ న్యాయవాది వద్దకు వెళ్లగా.. న్యాయం చేయాల్సింది పోయి తానే ఆ భూమిని లాక్కునేందుకు యత్నించాడు. నాగర్‌కర్నూల్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న దేశిటిక్యాల గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తి బతుకుదెరువుకోసం వలసవెల్లి పైసాపైసా కూడబెట్టి నాగనూలు గ్రామ శివారులో 3.26 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. తన తమ్ముళ్లు ముగ్గురు కూడా వాటాదారులాగా ఉన్నారు.
అయితే ఆ భూ పంపిణీ విషయంలో గొడవ మొదలైంది. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన ఓ న్యాయవాది వద్దకు వెళ్లారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న న్యాయవాది వారిని నమ్మించి భూమిని తనపేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందులో ఒక ఎకరా భూమిని ఇతరులకు కూడా అమ్మేశాడు. తర్వాత తమ భూమి తమ పేర చేయాలని దళితులు కోరడంతో నల్లకోర్టును అడ్డంపెట్టుకుని వారిపై బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆరోపించారు.
చివరకు ఓ పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టడంతో కోట్లు విలువజేసే భూమిని కేవలం రూ.30లక్షల చొప్పున ఇస్తానంటూ చిలకపలుకులు పలికాడు. దీంతో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడని తెలిసింది. బాధితులు ఎస్పీ, కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను కలిసి తమ గోడును వినిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కాగా ఇదే బాధితుల వద్ద మరో వకీలు రూ.80 వేలు తీసుకుని న్యాయం చేస్తానంటూ చేతులెత్తేశాడని బాధితులు ఆరోపించారు.