ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారని, ఇంకా 5 వేల కుటుంబాలకు పంపిణీ చేయాలన్నారు.
ప్రభు త్వం తనపై దాడి చేసినా భరిస్తానని, లబ్ధిదారులకు రెండో విడత దళితబంధు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు తమ వద్దకొస్తే దళితబంధు కోసం నిలదీయాలని సూచించారు. సీఎం రేవంత్ నియోజకవర్గంలో రైతులు తిరగబడి కలెక్టర్‌పై దాడి చేశారని, దళితబంధు ఇవ్వకపోతే హుజూరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తనది రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటమని, పోలీసులపై కాదన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద మూసీ పాదయాత్ర చేశారని చురకలు వేశారు. సీఎంకు దమ్ముంటే మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. సీఎం తన భాషను సరిదిద్దుకోవాలని సూచించారు. త్వరలోనే ప్రజలు రేవంత్‌రెడ్డిని ఉరికించే పరిస్థితి వస్తుందన్నారు.