సినిమా విజయోత్సవ సభలో దర్శకుడు బాబీ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాలో బాబీ డియోల్, ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రతి సినిమాను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తాను. సినిమాను ప్రేమించొద్దు.. ప్రేక్షకు లకు ఎలాంటి సినిమా అందించాలో నటీనటులు, దర్శకనిర్మాతలు ఆలోచించుకొని సినిమా తీస్తే చాలు. ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. జనవరి 22న అనంతపురంలోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించాం’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ, “డాకు మహారాజ్ సినిమా చూసి ఎందరో నాకు మాస్టర్ పీస్ అని మెసేజ్‌లు పెడుతున్నారు.
బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో ఒక మాస్టర్ పీఎస్ సినిమా ఇవ్వడానికి కారణమైన మా టీమ్ అందరికీ థాంక్యూ’ అన్నారు. నిర్మాత వంశీ మాట్లాడు తూ.. ‘బాలకృష్ణను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. అభిమానులు, ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ స్పందన లభించింది’ అన్నారు. థమన్ మాట్లాడుతూ.. ‘సక్సెస్ చాలా గొప్పది. డబ్బు పెడితే దొరకదు. అది ఎంతో ఎనర్జీ ఇస్తుంది. భవిష్యత్‌కు భరోసాను ఇస్తుంది.
ఈరోజుల్లో నిర్మాత ఒక విజయం సాధించడం తేలికైన విషయం కాదు. నిర్మాతను అందరూ ఒక దేవుడిలా చూడాలి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే నెగటివిటీని పక్కన పెట్టి, మనమందరం కలిసి మన సినిమాలకు మనమే సపోర్ట్ చేసుకోవాలి’ అన్నారు. హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాల నటి వేద అగర్వాల్, చిత్రబృందం పాల్గొన్నారు.