నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకు డు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తోపాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కా నుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రబృందం. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ఈ మూవీ టీమ్ ముచ్చటించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ, దర్శకుడు బాబీ, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. “బాలకృష్ణను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో మొదట్నుంచీ ఎంతో జాగ్రత్తగా సినిమాను రూపొందించాం. ‘డాకు మహారాజ్’ రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్సులుంటాయి.. ప్రతిదీ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది. అంతేకాదు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందీ సినిమా” అని చెప్పారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “డాకు మహారాజ్’ సినిమాను తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం. యూఎస్‌లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ జనవరి 12న విడుదలవుతోంది. జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ఈ సినిమా ప్రేక్షకులను అసలు నిరాశపరచదు” అన్నారు.
‘జనవరి 12న నా బర్త్‌డే. ఈ చిత్ర విజయాన్ని నా పుట్టినరోజు కానుకగా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో గుర్తుండిపోయే మంచి పాత్రను పోషించాను’ అని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలిపారు. మరో కథానాయిక శ్రద్ధాశ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. నా సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’ అన్నారు.