calender_icon.png 21 September, 2024 | 10:08 AM

"కాఫీ..ఉపాఖ్యానం"తో గుండె పదిలం

19-09-2024 01:02:20 PM

హైదరాబాద్: తెలుగు వారిళ్లలో  రోజూ కాఫీ తో శ్రీవారికి  మేలుకొలుపు సుప్రభాతం పాడే శ్రీమతి.. అప్పుడప్పుడు.. కాఫీ పేరుతో స్నేహితుల మీటింగ్.. ఇలాంటి దృశ్యాలు మామూలే..  ఏకంగా తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు వినూత్న సాహిత్య ప్రక్రియగా  కాఫీ..ఉపాఖ్యానం కూడా రాసేశారు..

ఇలా రోజుకు 3 కప్పుల కాఫీతో గుండెదడ అదుపులో ఉంచవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.  మధుమేహం, పెరాలిసిస్ వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫీన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాఫీ, టీలు మాత్రమే కాదు కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్.. ఇలా ఏవైనా సరే కానీ రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెప్పారు. కాఫీ, టీలు అస్సలు తాగని వారు, రోజుకు ఒకటీ అరా కప్పు తాగే వారితో పోలిస్తే మూడు కప్పులు తాగే వారిలో గుండె జబ్బుల ముప్పు 48 శాతం తక్కువగా ఉండడం తమ అధ్యయనంలో గుర్తించామని వివరించారు. ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డేటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించిన తర్వాత ఈ విషయాలు గుర్తించామన్నారు.