calender_icon.png 17 October, 2024 | 6:01 AM

కేంద్ర ఉద్యోగులకు ౩% డీఏ

17-10-2024 03:35:30 AM

తీపి కబురు

పలు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంపు

పీఎం- ఆశా పథకానికి రూ.35 వేలకోట్లు

వానకాలం సీజన్‌కు ఎరువుల సబ్సిడీ రూ.24,475 కోట్లు

వారణాసిలో గంగానదిపై వంతెనకు రూ.2,642 కోట్లు

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు నరేంద్రమోదీ సర్కారు బుధవారం దీపావళి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. పలు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరో 3 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 

53 శాతానికి డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు మరో 3 శాతం ఏడీను పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగు లకు డీఏ 50 శాతం ఉన్నది. తాజా నిర్ణయంతో 53 శాతానికి పెరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఖజానాపై రూ. 9448 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచింది. తాజా నిర్ణయంతో దాదాపు కోటిమంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.  

పీఎం-ఆశాకు రూ.35 వేల కోట్లు

రైతులకు కూడా ప్రభుత్వం తీపికబురు తెలిపింది. రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశా) పథకానికి రూ.35 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది. వానాకాలం పంటలకు సంబం ధించి నాన్ యూరియా ఎరువుల కోసం రూ.24,475 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వద్ద గంగానదిపై రైల్ వంతెన నిర్మాణానికి రూ.2,642 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది.

అన్నదాతకు దీపావళి మిఠాయి

పలు పంటలకు వానకాలం సీజన్ కోసం కనీస మద్దతు ధరను పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. 2025 ఏడాదిలో వానకాలానికి సంబంధించి పలు పంటలకు మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచింది. ప్రధానంగా గోధుమలకు క్వింటాల్‌కు రూ.150 పెంచింది. దీంతో గోధుమలకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,425కు చేరింది. ఆవాలకు అత్యధికంగా రూ.300 పెంచారు. దీంతో క్వింటాల్ ఆవాలకు ఎంఎస్‌పీ రూ.5950కి చేరింది. 

పంటలు.. ఎంఎస్‌పీ

(క్వింటాల్‌కు.. రూ.ల్లో)

పంట ఎంఎస్‌పీ మొత్తం 

పెంపు ఎంఎస్‌పీ 

ఆవాలు 300 5950

గోధుమ 150 2425

పెసలు 275 6700

శనగలు 210 5650

బార్లీ 130 1980

పొద్దు తిరుగుడు 140 5940