థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని అన్ని గ్రంథులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఒత్తిడి పెరిగిపోయి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా ఊబకాయం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం.. వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో చక్రాసనం వేయడం ద్వారా థైరాయిడ్ పనితీరుని మెరుగుపరచుకోవచ్చుంటున్నారు నిపుణులు.
ఎలా చేయాలి?
ఇది శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడంతో పాటు కండరాలను బలపరుస్తుంది. చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్లు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, శ్వాస తీసుకుంటూ నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తర్వాత మెల్ల మెల్లగా తలను నేలపై ఆనించి నడుమును కూడా ఆనించాలి. దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు
* వెన్నునొప్పి తగ్గిపోతుంది.
* థైరాయిడ్, శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
* ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
* చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తివంతంగా మారుతాయి.
* పొత్తి కడుపు కండరాలు బలంగా తయారవుతాయి.
* అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
* రుతుక్రమం సమస్యలు తొలగిపోతాయి.