దేశంలో, ముఖ్యంగా నగరాల్లో సైబర్ నేరాలు పెచ్చుమీరి పోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఒకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జరిగిన మోసం గ్రహించి సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసినా ఫలితం పెద్దగా ఉండడం లేదు. సైబర్ నేరగాళ్ల బారిన పడి సర్వస్వం కోల్పోయిన పలువురు కుటుంబ సభ్యులతో పాటుగా మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు కూడా. ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న వాళ్లు అమాయకులు కాకపోవడం విశేషం. బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోతున్నారు. ఇంతకీ సైబర్ నేరాలు ఇంతగా పెరిగిపోవడానికి కారణాలేమిటి? గత పదేళ్ల కాలంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది.
యువత ఫోన్లలో ఇంటర్‌నెట్ చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇంటర్‌నెట్ వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలను తెలు సుకునే అవకాశం లభిస్తోందనేది కాదనలేని నిజం. అయితే దీనితో పాటు ప్రమాదకరమైన సమాచారం కూడా అందుబాటులో ఉంటోంది. అదే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారుతోంది. ఇలాంటి వాళ్లను బురిడీ కొట్టించడంలో ఆరితేరిన ఈ నేరగాళ్లు రాత్రింబవళ్లు అదే పనిలో ఉంటున్నారు. సైబర్ సెక్యూరిటీ చర్యలు పటిష్ఠంగా లేకపోవడంవల్ల కూడా వ్యక్తులు సులభంగాసైబర్ దాడులకు బలవుతున్నారు. వ్యక్తులే కాదు, సంస్థలు కూడా దాడులను తప్పించుకోవడం లేదంటే వారు ఎంతగా ఆరితేరారో అర్థమవుతుంది.
ఇదే కాకుండా దేశంలో డిజిటల్ విప్లవం కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుకొని అన్ని ఆర్థిక లావాదేవీలు ఇంటర్నెట్‌ద్వారానే జరుగుతున్నాయి.పది రూపాయల టీ మొదలుకొని వేల రూపాయల వస్తువును కొనడానికి కూడా గూగుల్ పేలాంటి ఈ కామర్స్ వేదికలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఏ బ్యాంకు మెస్సేజిలాగానో లేదా ఒటిపి నంబర్ అడగడం ద్వారానో వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి వారి బ్యాంకు ఖాతాలనుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. తమ సొమ్ము చోరీ అయిందనే విషయం వారు తెలుసుకునే లోగానే నేరగాళ్లు తట్టా బుట్టా సర్దేసుకుని బిచాణా ఎత్తేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ వాళ్లకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టుబడి మన సొమ్ము తిరిగి వస్తున్న సందర్భాలు చాలా తక్కువ.
సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన, చైతన్యం లేకపోవడమే దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఎలాంటి ముప్పులు ఎదురవుతాయి, వాటిని ఎలా నిరోధించవచ్చనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. దేశంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. నిత్యం మారిపోతున్న సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త మోసాలతో సమానంగా ఎదగడంలో ఇది పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. సైబర్ సెక్యూరిటీ చర్యలకు తగినంతగా నిధులు కేటాయిం చకపోవడం, కాలం చెల్లిన వ్యవస్థలు, ప్రభుత్వ ఏజన్సీలు, ప్రైవేటు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం లాంటివి సైబర్ నేరగాళ్లు అమాయకులను వలలో వేసుకోవడానికి తోడ్పడుతున్న లోపాలు. సైబర్ నేరాల కారణంగా వ్యక్తులు, వ్యాపార సంస్థలు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం జరుగుతోంది.
ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ స్కామ్‌లు, వ్యక్తిగత సమాచారం చోరీ లాంటి వాటి కారణంగా చాలా మంది తాము చెమటోడ్చి సంపాదించిన, కూడబెట్టుకున్న లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. డేటా చోరీ కారణంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో గోప్యత ఉండడం లేదు. ఇలాంటి దాడుల కారణంగా బ్యాంకింగ్ లాంటి అత్యవసర సేవలు కూడా అస్తవ్యస్తమవుతున్నాయి. సమాజంపైన కూడా ఈ సైబర్ నేరాల ప్రభావం పడుతోంది. వీటిని అరికట్టడానికి సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రజలకు వీటిపట్ల అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ముఖ్యంగా ప్రతిదానికీ ఇంటర్నెట్‌పై ఆధారపడడం తగ్గిస్తే నేరాలను కాస్తయినా అరికట్టవచ్చు.