రూ.40 లక్షలు లూటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): నగరానికి చెందిన ఓ మహిళ(40)కు ఫెడెక్స్ కొరియర్ పేరుతో గురువారం ఓ ఫోన్ వచ్చింది. తన పేరు, చిరునామాతో గల పార్శిల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఎండీఎంఏ డ్రగ్స్ వంటివి ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమెపై ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు కేసు నమోదు చేశారని చెప్పారు. కాసేపటి తర్వాత క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి ఆమె కు ఓ హత్య కేసులో ప్రమేయం ఉందని నిర్ధారణ అయినట్టు భయపెట్టారు. సైబ ర్ నేరగాళ్లలో ఒకరు బాధితురాలికి మ హారాష్ట్ర మాజీ సీఎం ఫొటో పంపి, తనకు ప్రపంచవ్యాప్తంగా పలువురితో పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
కేసుల నుంచి బయటపడాలంటే డబ్బు పంపాలని, లేకపోతే అన్ని కేసుల్లో ఆమెను ఇరికిస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆమె కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు రూ. 40 లక్షలు అతడు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.