- ఐదు రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్
- ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 23 మంది అరెస్టు
- కోదాడ పరిసర గ్రామాల్లో జోరుగా ఆన్‌లైన్ ట్రేడింగ్!
- వివరాలు వెల్లడించిన సీసీఎస్ డీసీపీ దార కవిత
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్‌ను ఛేదించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి సైబర్ మోసాలకు పాల్పడుతున్న 23 మం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా దేశ వ్యాప్తంగా 359 కేసులు, తెలంగాణలో 30 కేసులలో నిందితులుగా ఉండటంతో పాటు 14 కేసులలో రూ. 5.29 కోట్ల మేర సైబర్ మోసాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు.
3 కేసుల్లో రూ.39 లక్షలను రికవరీ చేయగా, మరో మూడు బ్యాంకుల నుంచి సొమ్ము రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఆన్‌లైన్ లింక్‌లు ఓపెన్ చేయకపోవడంతో పాటు ఓటీపీ కూడా ఎవరితోనూ షేర్ చేయనప్పటికీ తన ఖాతా నుంచి రూ.1.90 కోట్లు మరో ఖాతాకు బదిలీ అయినట్లు ఓ వృద్ధ్దుడు(70) చేసిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా సంచలనా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లా కోదాడ పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాలలో ఏకంగా ఓ గ్రామం అంతా కలిసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.
ఎన్‌జీవో ఖాతాలోకి రూ.1.90 కోట్లు
హైదరాబాద్ బషీర్‌బాగ్ అవంతినగర్‌కు చెందిన ఓ వృద్ధుడి(70) ఖాతా నుంచి అనధికారికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1.90 కోట్లు బదిలీకావడంతో అతడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు (2965/2024) చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ నగదు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేశ్ కుమారికి చెందిన ఎన్‌జీవో ఖాతాలో బదిలీ అయినట్టుగా గుర్తించారు.
దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫోన్ హ్యాక్ కావడంతో బాధితుడి ఖాతా నుంచి నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బుమళ్లించినట్లు తేలింది. అనంతరం ఎన్‌జీవో నిర్వాహకురాలు కమలేశ్ కుమారి ఖాతా నుంచి ప్రధాన నిందితుడి ఖాతాకు నగదు బదిలీకావడాన్ని పోలీసులు గుర్తించారు.
ఈమె యూపీలోని ఓ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీచేసినట్టు సమాచారం. అయితే ఎన్‌జీవో నిర్వాహకురాలు కమలేశ్ కుమారికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు యూపీ, హైదరాబాద్‌లలో న్యాయవాదులు పదుల సంఖ్యలో రావడాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు కోర్టు అనుమతి ద్వారా ఆమెను అరెస్టు చేశారు.
డ్రిజిటల్ అరెస్టు పేరుతో..
నగరానికి చెందిన ఓ వ్యక్తికి డీహెచ్‌ఎల్ కొరియర్ (వెస్ట్ ముంబాయి) పేరుతో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ పార్సిల్ ముంబాయి ఎయిర్‌పోర్టులో ఉంది. ఈ పార్సిల్‌లో నిషేధిత సామగ్రి ఉన్నందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ చెప్పారు. అలాగే .. మేం చెప్పింది చేయాలంటూ స్కైప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. తదనంతరం ఎలా బ్రేక్ లేకుండా వారం రోజులు వీడియో కాల్ ద్వారా బాధితుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బంధించారు.
ఈ క్రమంలో తాము చెప్పిన ఖాతాకు డబ్బు పంపాలని చేప్పడంతో బాధితుడు డబ్బు బదలాయించాడు. డబ్బు బదిలీ తర్వాత నేరగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు పోలీ ఫిర్యాదు చేశాడు. ఇలా దాదాపు 23మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఏసీపీ శివ మారుతి, సీఐలు సతీష్ రెడ్డి, ప్రమోద్ కుమార్, సీతారాములు, ఎస్సైలు సీహెచ్ వెంకటాద్రి, షేక్ అజీజ్‌ను సీసీఎస్ డీసీపీ కవిత ప్రత్యేకంగా అభినందించారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి...
రూ.40వేల నగదు
25 మొబైల్ ఫోన్లు
45 సిమ్ కార్డులు
28 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు
23 డెబిట్, క్రెడిట్ కార్డులు
ఒక ల్యాప్‌టాప్
3 క్యూఆర్ కోడ్ స్కానర్లు
5 షెల్ కంపెనీ స్టాంప్స్
టేడింగ్ పేరుతో రూ.2.90 కోట్లకు కుచ్చుటోపి..
హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తిని తన ప్రమేయం లేకుండానే మార్వెల్ కాపిటా పేరు కలిగిన వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా లాభాలు వచ్చినట్టుగా ఆన్‌లైన్‌లో చూపించడంతో ఆశకలిగిన సదరు బాధితుడు ఏకంగా రూ.2.90 కోట్ల మేర పెట్టుబడి పెట్టాడు. అనంతరం ఎంతకీ లాభాలు రాకపోవడాన్ని గమనించిన బాధితుడు మోసపోయినట్టుగా గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా..ఈ డబ్బును కర్నాటకకు చెందిన సమీర్, దీపక్ సంపత్ దుబాయ్‌లో ఉండే ప్రధాన నిందితుడి ఖాతాకు మళ్లించినట్టుగా గుర్తించారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు, సిమ్ కార్డులు, క్యూఆర్ కోడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును మరింత లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సూర్యాపేట జిల్లా కోదాడ పరిసరాలలోని రెండు గ్రామాలలో గ్రామం మొత్తం ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా లక్షలు సంపాదించడానికి తల్లిదండ్రులే పిల్లలను ప్రోత్సహిస్తున్నటుల పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ పీజీ విద్యార్థినితో పాటు మరో బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయా గ్రామాల పేర్లను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.