- బెల్గాంలో రెండ్రోజుల పాటు నిర్వహణ
- బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న
- సీఎం, పీసీసీ చీఫ్, ఇతర నేతలు
- ఏడాది పాలన, పథకాల అమలుపై నివేదించనున్న నాయకులు
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : కర్ణాకటలోని బెల్గాంలో రెండు రోజుల పాటు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
రాష్ట్రం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ సభ్యులు, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ వంశీచందర్‌రెడ్డి గురువారం బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బెల్గాంకు వెళ్లనున్నారు.
గురువారం సాయంత్రం మూడుగంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. అయితే రెండు రోజుల పాటు సమావేశాలు జరగనుండటంతో పార్టీ నేతలు అక్కడే ఉండనున్నారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలు హాజరై దేశంలోని కీలక అంశాలపై చర్చించనున్నారు.
అదేవిధంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనతోపాటు ఏడాది పాలనపై నివేదికను అధిష్టానం ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశాల్లోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.