నాగర్ కర్నూల్, జనవరి 13 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోని కొబ్బరి చెట్లను కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించడం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు నీడ ఇవ్వడంతో పాటు ఆలయానికి సైతం కొంత ఆదాయం సమకూర్చే విధంగా భారీ కొబ్బరి చెట్లను తొలగించడం పట్ల స్థానికులు మండి పడుతున్నారు.
పట్టపగలే చెట్లను నరికి వేస్తున్నా సంబంధిత ఆలయ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా జరిగే రథసప్తమి వేడుకల్లోనూ జాతర పేరుతో భారీగా విరాళాలు సేకరించి ఆలయ అభివద్ధికి ఖర్చు చేయడం లేదన్న విమర్శలు కూడా బాహాటంగా వినిపిస్తున్నాయి. కొంతమంది దళారులు కక్కుర్తి పడి భారీ వక్షాలను తొలగించినట్లు ఆరోపిస్తున్నారు.
భక్తులు మోక్కులు చెల్లించుకునేందుకు తరచూ సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు వంటి వాటిలోనూ ఆలయ పూజారులు, ఆలయ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని భక్తుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. కొబ్బరికాయ ఇతర సామాగ్రి అమ్మకాల విషయంలోనూ తరచూ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు పాలెం ఆలయ నిర్వహణ అంశాలపై పర్యవేక్షణ జరపాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ ఈవోను వివరణ కోరెందుకు ప్రయత్నించగా తాను అందుబాటులోకి రాలేదు.