రూ.3.81 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పలు రంగాల రాయితీల్లో కోత విధించింది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లో ఇస్తున్న సబ్సిడీలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం సబ్సిడీల కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.3,81,175 కోట్లు కేటాయించింది. క్రితం ఏడాది కేటాయించిన రూ.4,13,466 కోట్లతో పోలిస్తే ఇది 7.8 శాతం తక్కువ, ఈ తగ్గింపు మధ్యంతర బడ్జెట్‌కు అనుగుణంగానే ఉండడం గమనార్హం. ఆహార సబ్సిడీ కోసం రూ.2,05,250 కోట్లు కేటాయించారు.
2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.2.12.332 కోట్లుగా ఉంది. ధాన్యం సేకరణ వ్యయం,అమ్మకాలద్వారా వచ్చిన ఆదాయం మధ్య అంతరంతో పాటుగా 80 కోట్ల మందికి ఇస్తున్న ఉచిత రేషన్ వంటివి ఈ సబ్సిడీ కిందికి వస్తాయి. క్రితం ఏడాది ఎరువుల రాయితీ కోసం కేంద్రం రూ.1,88. 894 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.1,64,000 కోట్లకు తగ్గించారు. యూరియా, ఇతర ఎరువులతో పాటుగా డీఏపీ, ఎంఓపీ వంటి వాటి కోసం ఈ సబ్సిడీని కేంద్రం ఉపయోగిస్తుంది. రైతులకు కావలసిన వస్తువులను అందుబాటు ధరలో ఉంచడం కోసం తయారీ సంస్థలకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. వంటగ్యాస్ సహా పెట్రోలియం సబ్సిడీల కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.11,925 కోట్లను కేటాయించింది. క్రితం ఏడాది కేటాయించిన రూ.12,240 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గించింది.