28-08-2024 12:52:57 AM
కేటాయింపుల్లో 50 నుంచి 75 శాతం తగ్గించుకునే ప్రయత్నం
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం
స్కీముల విలీనం లేదా తొలగింపునకు చర్యలు
రాష్ట్రాలపైనే భారం వేయాలని ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 27: కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాలకు అందించే పథకాల్లో తన వాటాను 50 నుంచి 75 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పథకాలను ఇతర వాటిల్లో కలిపేయడం లేదా ప్రస్తుత అవసరాలను తీర్చలేని వాటిని తొలగించడం వంటి చర్యల ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా కొన్ని పథకాలకు సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే జవాబుదారీ తనం తీసుకోవడంతో పాటు అధిక శాతం కేటాయింపులు రాష్ట్రాలే చేసేలా నిబంధనలు తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్దీకరణలో తర్వాతి దశ మొదలైంది. ఆయా మంత్రిత్వ శాఖలకు ఈ మేరకు ఆదేశాలు అందాయి. అంతర్గత సమీక్షలతో పాటు మదింపులను అక్టోబర్ నెల చివరినాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏయే పథకాలు ముగింపు దశకు చేరుకున్నా యో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
పథకాల విలీనం
ప్రస్తుతం కేంద్ర పథకాలకు సంబంధించి బడ్జెట్‌లో 10 శాతం ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇది ప్రభుత్వ నిధుల వినియోగంలో హేతుబద్ధతను కాపాడేందుకు మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 2024 బడ్జెట్‌లో పథకాల కోసం రూ.5.05 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. మరో అధికారి మాట్లాడుతూ.. కొన్ని పథకాలను సమీప లేదా పెద్ద స్కీముల్లో భాగం చేసేలా కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఇందులో జలశక్తి, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పునరుత్పాదక శక్తి, సామాజిక రంగాలకు చెందిన పథకాలు ఉన్నట్లు వివరించారు. ఈ మదింపులన్ని ఆయా రంగాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? వాటి ప్రభావం ఎంత? భవిష్యత్తులో ఉపయోగమెంత? అనే అంశాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
రాష్ట్రాలపైనే భారం
అంతేకాకుండా కేంద్ర, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యంపైనా ప్రభుత్వం పునఃపరిశీలించనున్నట్లు తెలుస్తోంది. పథకాలకు సంబం ధించి రాష్ట్రాలే అధిక మొత్తంలో ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. 2015 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రుల ఉపకమిటీని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేంద్రం నిధులు కేటాయించే పథకాలను 130 నుంచి 75కు తగ్గిస్తూ వచ్చారు. మరోవైపు నీతి ఆయోగ్ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ మదింపు చేస్తూ వస్తోంది. పథకాలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టేందుకు కన్సల్టెన్సీ సంస్థలను నియమించాలని నీతిఆయోగ్ ఇప్పటికే ప్రభు త్వానికి సిఫార్సులు చేసింది.