calender_icon.png 24 November, 2024 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అదుపులో సైబర్ నేరస్థుడు

24-11-2024 12:34:48 AM

కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో రూ.21.80 లక్షల మోసం

కరీంనగర్, నవంబరు 23 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో బెదిరించి రూ.21.80 లక్షలు లూటీ చేసిన సైబర్ మోసగాడిని కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాకు చెందిన ఓ మహిళకు కొన్ని రోజుల క్రితం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో సదరు మహిళ పేర పార్శిల్ వచ్చిందని, అందులో ఏటీఎం కార్డులు, డ్రగ్, పాస్‌పోర్టులు దొరికాయని, వెంటనే ఢిల్లీ పోలీసులతో మాట్లాడాలని అవతలి వ్యక్తి భయభ్రాంతులకు గురిచేశాడు.

ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన ఖాతాల్లోకి నగదు జమ చేయాలని సైబర్ మోసగాడు నమ్మించాడు. భయపడిపోయిన సదరు మహిళ నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలో రెండు దఫాలుగా రూ.21.80 లక్షలు జమ చేసింది. తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ సైబర్ క్రైమ్ డీఎస్పీ నర్సింహారెడ్డి కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు.

ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వంశీకృష్ణ సిబ్బందితో కలిసి ఒడిశాకు వెళ్లారు. భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న నిందితుడు సదాన్షు శేఖర్ మహంతిని శనివారం అరెస్టు చేసి కరీంనగర్‌కు తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. శేఖర్‌తోపాటు అతడి అన్న సర్వేశ్వర్ మహంతి ఇద్దరు కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. సర్వేశ్వర్  మహంతి ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు.