calender_icon.png 4 February, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాల తేనెతుట్టె

04-02-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ముందునుంచీ హెచ్చరిస్తున్నట్లుగానే తమ పొరుగు దేశాలయిన కెనడా, మెక్సికోలతో పాటుగా చైనాపై సుంకాల కొరడా ఝళిపించడం ద్వారా వాణిజ్యయుద్ధానికి తెరదీశారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలయిన మెక్సికో, కెనడాలనుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25శాతం, చైనానుంచి వచ్చే అన్ని వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తూ తాజాగా ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

పెయిన్ కిల్లర్ అయిన ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే ఈ చర్య తీసుకొంటున్నట్లు ప్రకటించారు. దీనివల్ల అమెరికన్లకు కొంత బాధ కలగవచ్చని, అయితే అమెరికాను గొప్పదేశంగా నిలబెట్టడం కోసం ఈ భారం భరించక తప్పదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు ఈయూ దేశాలపైనా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు ఇచ్చారు.

ట్రంప్ చర్యలపై అటు కెనడా, ఇటు మెక్సికో తీవ్రంగా స్పందించాయి. కార్చిచ్చు, హరికేన్ల సమయంలో అమెరికాకు అండగా నిలిచామని, అలాగే అఫ్గానిస్థాన్‌లో అమెరికా సేనలకు మద్దతుగా తమ సేనలు కూడా పోరాడాయని కెనడా ప్రధాని ట్రూడో గుర్తు చేశారు. సాయానికి ప్రతిఫలం ఇదేనా? అని ప్రశ్నించిన ఆయన అమెరికానుంచి దిగుమతి చేసుకునే 15,500 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై తాముకూడా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు  ఇలాంటి బెదిరింపులకు తాము తలవంచేది లేదని మెక్సికో అధ్యక్షురాలు షాన్‌బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రెండు దేశాల సంగతి ఇలాఉంటే ట్రంప్ చర్యపై డ్రాగన్ ప్రభుత్వం మండిపడింది. దాన్ని ప్రపంచ వాణిజ్య సంస ్థ(డబ్ల్యూటీవో)లో సవాలు చేస్తామని ఆ దేశ వాణిజ్య శాఖ ప్రకటించింది.

ఈ సందర్భంగా ‘ టారిఫ్ వార్, ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్‌లలో విజేతలు ఎవరూ ఉండరు’ అంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా ఉత్తర్వులతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉందని, ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

తాను అధికారం లోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్ల ధరలు తగ్గిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత వాణిజ్య యుద్ధం బెడిసికొడితే ధరలు భారీగా పెరిగే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని డెమోక్రాట్లు తప్పుబడు తుండగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

ట్రంప్ నిర్ణయం ప్రభావం అమెరికాతో పాటుగా అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లపైనా ప్రభావం చూపించింది. ఆ మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు కూడా ఇ లాంటి ట్రేడ్‌వార్‌కు తెరదీశారు. ముఖ్యంగా చైనా వస్తువులపై 50 బిలియ న్ డాలర్ల సుంకాలను వర్తింపజేయాలంటూ 2018 మార్చి 22న ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే వివిధ దేశాలనుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానెళ్లు, వాషింగ్ మిషన్లపైనా, ఉక్కు, అల్యూమియంపైనా భారీ గా సుంకాలు విధించారు.  ఈ సుంకాలు భారత్ సహా పలు వాణిజ్య భాగస్వాములకు కోపం తెప్పించాయి. కానీ ఏడాది తిరిగేలోగా ఆయా దేశాల తో చర్చల ద్వారా ట్రంప్ ఈ సుంకాలను ఉపసంహరించున్నారు. ఈ సుం కాలు అమెరికా జీడీపీని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని వివిధ విశ్లేషణల్లో తేలింది.

ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మారి నట్లు ఆ విశ్లేషణలు నిర్ధారించాయి. ట్రంప్ ఇక్కడితో ఆగకుండా ఐరోపా సమాఖ్య దేశాలపైనా ట్రేడ్‌వార్‌కు సిద్ధమయితే చివరికి లాభపడేది చైనాయేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి మరోసారి ట్రంప్ సుంకాల తేనెతుట్టెను కదిపి కష్టాలను కొని తెచ్చుకుంటారో వేచి చూడాలి.