calender_icon.png 7 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ పేరిట కొర్రీలు?

07-11-2024 12:52:08 AM

  1. పత్తి రైతు తంటాలు
  2. దూది పించ కొనని సీసీఐ
  3. తక్కువ ధరకే కొంటున్న జిన్నింగ్ మిల్లులు

సిరిసిల్ల, నవంబర్ 6 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులకు తంటాలు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ, తేమ పేరిట అధికారులు కొర్రీలు పెడుతున్నారు. సీసీఐకి తీసుకువచ్చిన పత్తిని తప్పని పరిస్థితుల్లో జిన్నింగ్ మిల్లులోనే తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. ఇదంతా అధికారుల ముందే జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

సిరిసిల్ల జిల్లా రైతులు ఆశించినంతగా దిగుబడులు వచ్చినప్పటికీ, మద్దతు ధర లభించక ఆవేదన చెందుతున్నారు. తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని అధికారులు నిబంధనలు పెట్టారు. అయితే గత మూడు రోజులుగా వాతావరణంలో మార్పులతో మంచు కురియడం, కొన్ని  ప్రాంతాల్లో  వర్షం కురియడంతో చెట్టు మీదనే పత్తి తడిగా మారింది.

చేతికందిన పంటను ఏరకపోతే, వర్షం పాలు అవుతుందనే బెంగతో కూలీలకు అధిక కూలీరేటు చెల్లించి పత్తిని తీసి సీసీఐలకు తరలిస్తున్నారు. అయితే అధికారులు తెలిపిన ప్రకారం మాత్రం తేమ లేకపోవడం, 20 నుంచి 40 వరకు తేమ శాతం ఉండటంతో పత్తిని కాంటా వేయడంలేదు. దీంతో గత్యంతరం లేక సీసీఐకి తీసుకువచ్చిన పత్తిని జిన్నింగ్ మిల్లులో తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. 

ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తేమ పేరిట పత్తిని కొనుగోలు చేయలేదు. జిల్లాలో 13 మండలాల్లో పత్తి పంట 42,332 ఎకరాల్లో సాగు చేయగా 30,029 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారలు అంచ నా వేశారు.

రైతులు ఎకరాకు పత్తి పంట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల ఖ ర్చు చేశారు. అదనపు ఖర్చులు పెరిగిపోవడం, ఆశించినంతగా మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు తేమశాతం ఎక్కువ ఉన్న పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు మిల్లుల్లో అమ్ముకుంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని క్వింటాలుకు రూ.6,100 నుంచి రూ.6,400 వరకు చెల్లించి కొంటున్నారు. 

తేమ శాతం తక్కువగా ఉండాలి

పత్తిలో తేమ శాతం తగ్గినప్పుడే రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు పత్తిని కొనుగోలు చేయలేదు. నిబంధనల ప్రకారం 8 శాతం నుంచి 12 శాతం తేమ ఉంటేనే పత్తిని కొంటాం. మిగితా జిల్లాలో తేమశాతం ఉన్న పత్తిని కొంటున్నారు. తేమ ఎక్కువగా లేకుండా పత్తిని ఆరబెట్టి కేంద్రానికి తీసుకురావాలి.

 - ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, సిరిసిల్ల