25-02-2025 12:00:00 AM
తెలుగులో కొంత కాలం హవా సాగించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ఆ తరువాత అసలు టాలీవుడ్ నుంచి పూర్తిగా తప్పుకుంది. ప్రస్తుతం రకుల్‌కు బాలీవుడ్‌లో వరుస అవకాశాలైతే వస్తున్నాయి. వాటితో మంచి హిట్ కొట్టి అక్కడ సెటిల్ అవుతామనుకుంటే అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. వస్తున్న అవకాశాలు.. సక్సెస్‌ను మాత్రం తెచ్చి పెట్టడం లేదు.
తాజాగా ఆమె ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా రకుల్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. దీనిపై రకుల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమాకూ ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఎందుకోగానీ ఈ సినిమాకు రకుల్ ఆశించినంత బజ్ రాలేదు. అసలు ప్రమోషన్సే గట్టిగా చేసింది లేదు. దీంతో సినిమాకు ఓపెనింగ్ అంతగా రాదని మేకర్స్ ముందే ఊహించినట్టున్నారు. ఈ క్రమంలోనే కొన్ని స్క్రీన్స్‌లో 1 ప్లస్ 1 ఆఫర్ పెట్టారు. ఒక టికెట్ కొంటే రెండు టికెట్లు అన్నా కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆక్యుపెన్సీ పెద్దగా నమోదు కాకపోవడంతో వసూళ్లు దారుణంగా ఉన్నాయట. మొత్తానికి రకుల్‌కు ఇది ఊహించని దెబ్బే. మరి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలైనా అమ్మడికి ఏమైనా మైలేజ్ తెచ్చిపెడతాయో లేదో చూడాలి.