calender_icon.png 9 November, 2024 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతిలో కరెంట్ బాంబు!

09-11-2024 12:59:56 AM

ప్రభుత్వానికి చేరిన విద్యుత్తు కమిషన్ విచారణ నివేదిక

  1. విద్యుత్తు ఒప్పందాల్లోని లోపాలను ఎత్తిచూపిన కమిషన్ 
  2. బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్‌పై ఇవ్వడమూ తప్పే
  3. గ్రిడ్ కారిడార్‌ను బుక్‌చేయడం లోపభూయిష్టం
  4. నివేదికపై న్యాయ నిపుణులతో చర్చించిన సీఎం 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. గతంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాల్లోని లోపాలపై ఏర్పాటుచేసిన విద్యుత్తు విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ప్రభుత్వం పేల్చబోతున్న మరో బాంబులా కనపడుతోంది.

గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడం తదితర అంశాల్లో గత ప్రభుత్వం, పాలకుల పాత్రలను ఎత్తిచూపుతూ.. ఇచ్చిన నివేదికపై ఎలా ముందుకు వెళదామనే న్యాయపరమైన అంశాలపై కూడా అధ్యయనం చేస్తోంది.

త్వరలోనే ఈ నివేదిక ఆధారంగా ప్రాసిక్యూషన్ చేయాలా.. లేక కేసు నమోదు చేయాలా అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సర్కారుకు చేరిన విచారణ కమిషన్ నివేదిక

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తుపై తీసుకున్న తప్పుడు నిర్ణయాల నేపథ్యంలో విద్యుత్తు సంస్థలకు భారీ నష్టం సంభవించిన విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డిని విచారణ కమిషన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పాత్రపైకూడా కమిషన్ విచారించింది.

దీనికి సమాధానం కూడా కేసీఆర్ రాశారు. అయితే విచారణ పూర్తి కాకుండానే మీడియాకు తప్పు జరిగిందని కమిషన్ చెప్పిందని పేర్కొంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళారు. ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఈ విచారణ సందర్భంగానే కమిషన్ చైర్మన్‌ను మార్చాలనే సుప్రీంకోర్టు నిర్ణయానికి రావడంతో.. తీర్పు చెప్పకముందే జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా సమర్పించారు.

దీనితో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను చైర్మన్‌గా నియమించింది. జస్టిస్ లోకూర్ కమిషన్ చాలా వేగంగా విచారణను పూర్తి చేశారు. అప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నుంచి సవివరంగా లేఖ రావడంతో.. దానినే లోతుగా పరిశీలించారు.

ఈ నేపథ్యంలోనే మొత్తం ఏడు అంశాలకుగాను.. నాలుగు అంశాల్లో తప్పులు జరిగినట్టుగా కమిషన్ అభిప్రాయపడింది. ఈ నాలుగు అంశాల్లోనూ అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యతలు, కీలక పాత్రను పోషించినట్టుగా.. ఆయన లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగానే కమిషన్ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 29 నాటికి కమిషన్ గడువు పూర్తి అయ్యేలోగానే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

నాలుగు అంశాలు..

గత ప్రభుత్వం కుదుర్చుకున్న చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం.. కారిడార్ వ్యవహారం, అలాగే బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్‌పై థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను ఇవ్వడం, థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ సాంకేతికతను వాడాలనే నిర్ణయం తీసుకోవడం లాంటి నాలుగు అంశాల్లో అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యతలను ఈ నివేదికలో కమిషన్ పొందుపర్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఏడు అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ నుంచి సమాధానాలు వచ్చినా.. అందులో నాలుగు అంశాల్లో మాత్రమే ఆయన కీలకపాత్రను నివేదికలో ఎత్తిచూపినట్టుగా తెలిసింది. 

చత్తీస్‌గఢ్ నుంచి వేయి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుని.. 2000 మెగావాట్ల గ్రిడ్ కారిడార్‌ను ఎలా బుక్ చేసుకుంటారని ఈ నివేదికలో తప్పుపట్టినట్టు సమాచారం. అలాగే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి సంబంధించి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడాలనే నిర్ణయం తీసుకోవడాన్నికూడా ఈ నివేదికలో కమిషన్ ఎత్తిచూపినట్టు తెలుస్తుంది.

దీనితోపాటు థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడాన్ని కూడా కమిషన్ తప్పుపట్టినట్టుగా తెలుస్తుంది. ఇలా తప్పొప్పు లను నిర్ణయిస్తూ కమిషన్ నుంచి వచ్చిన నివేదికపై ప్రభుత్వం లోతుగా విశ్లేషిస్తోంది.

న్యాయ నిపుణులతో మంతనాలు

విద్యుత్తు విచారణ కమిషన్ నుంచి వచ్చిన నివేదిక.. అందులో పేర్కొన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇంధన, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు ఐదారు రోజుల క్రితం సచివాలయంలోని తన చాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నివేదికపై లోతుగా చర్చించినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం.

ఈ సమాలోచనలో అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలను కూడా సీఎం తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కమిషన్ నివేదికపై ముందుకు ఎలా వెళ్ళవచ్చు.. ఒకవేళ వెలితే ఏ విధమైన న్యాయపరమైన అంశాలు ఎదురవుతాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే కోణంలో చర్చించినట్టు తెలుస్తుంది.

కమిషన్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి.. ఆ తరువాత ప్రాసిక్యూషన్ చేయవచ్చా.. ప్రాసిక్యూషన్ చేసేందుకు ఉన్న న్యాయపరమైన అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి అనే కోణంలోనూ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నట్టు సమాచా రం. దీనితోపాటు.. నివేదికను ఆధారంగా చేసుకుని కేసు నమోదుచేయవచ్చా.. అలా చేస్తే ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఉంటాయి.. అనే సమాచారాన్నికూడా విశ్లేషించినట్టు తెలుస్తుంది.

దీనితోపాటు కొన్ని అంశాల్లో.. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలపైకూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఆ నష్టం ఎంత మేర ఉండే అవకాశం ఉంది.. ఈ మొత్తాన్ని రికవరీ చేయడం ఎలా.. ఇందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలా.. అనే కోణం లోనూ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం చర్చించినట్టు తెలుస్తుంది.