calender_icon.png 6 January, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం

01-08-2024 02:26:36 AM

  1. బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలతో వేడెక్కిన అసెంబ్లీ
  2. పోడియం ముందు బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల నిరసన
  3. గురువారానికి సభ వాయిదా వేసిన స్పీకర్

హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాల మధ్యే బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3.27 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా, బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలతో గందరగోళం ఏర్పడింది. సబితా ఇంద్రారెడ్డిని కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబడ్డారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

తమకు మాట్లాడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన తర్వాతనే అవకాశం ఇస్తామంటూ స్పీకర్ చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ జోక్యం చేసుకుంటూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ఇదే సమయంలో బిల్లుపై మాట్లాడేందుకు ఏలేటి ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలతో గందరగోళం ఏర్పడింది. అదేసమయంలో ఏలేటి మాట్లాడాలంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. సభను క్రమశిక్షణలో పెట్టాలంటూ మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సభలోని సభ్యురాలిపై మాట్లాడినప్పుడు తిరిగి ఆమె వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఎవరి పేరూ తీసుకోలేదని, అప్పుడే ఈ అంశంపై సమాధానం చెప్పారంటూ వివరణ ఇచ్చారు. ఈ గందరగోళం మధ్య బీజేపీ పక్ష నేత మాట్లాడే పరిస్థితి కనిపించక కూర్చుండిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ వివేక్ ప్రసంగం ప్రారంభించారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఎంతగా నినాదాలు చేసినా ఆయన తన ప్రసంగాన్ని ఆపలేదు. దీనిపై బీజేపీ పక్షనేత ఏలేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో ఇంత గందరగోళం జరుగుతుంటే ఎలా మాట్లాడుతున్నారంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్‌ను చూస్తూ అన్నారు.

వివేక్ బదులుగా సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇస్తే సరిపోతుంది కదా అన్నారు. వివేక్ మాట్లాడటం పూర్తయ్యాకే ఇస్తా అంటూ స్పీకర్ సమాధానమిచ్చారు. అదే సమయంలో పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ మహిళా ఎమ్మెల్యేలకు మద్దతుగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై సీఎం వైఖరి నశించాలంటూ ఆందోళన చేపట్టారు. చప్పట్లతో తమ నిరసన తెలిపారు.

గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం 

సభలో బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు ఓవైపు, ప్రతిగా కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్యనే డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన సందర్భంలోనే కనీసం బిల్లుపై తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 

శాసనమండలి ఆమోదం  

ద్రవ్య వినియమ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వాణిదేవి, శంబీపూర్ రాజు, మహమూద్ అలీ దీనిపై చర్చ పెట్టాలని చైర్మన్‌ను కోరగా, ఆయన వారికి సమయం ఇవ్వకుండానే బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు సభను వాకౌట్ చేసి వెళ్లిపోయారు. వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. బిల్లుకు ఆమోదం లభించిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటన చేసి మండలిని గురువారానికి వాయిదా వేశారు. ఐదు నిమిషాల్లో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందింది.