19-03-2025 12:33:48 AM
హ్మర్ తెగ సంస్థ నాయకుడిపై దాడి..
ఇంఫాల్: మణిపూర్‌లోని చుర్‌చంద్పూర్ జిల్లాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. కుకీ ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లాలో హ్మర్ తెగ సంస్థ నాయకుడిపై సోమవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన నేపథ్యంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. న్యాయం కావాలంటూ హ్మర్ తెగ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెక్షన్ 163 కింద కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జెన్‌హంగ్ లమ్కాలోని వీకే మాంటెస్సరీ కాంప్లెక్స్‌లో హ్మర్ తెగ జనరల్ సెక్రటరీ రిచర్డ్ హ్మర్‌పై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడిని నిరసిస్తూ ఆందోళనకారులు బలవంతంగా షాపులు మూయించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.