16-11-2024 12:00:00 AM
నాకు నచ్చిన ఒక ‘అల్మారా’(బీరువా)ను కొనలేక పోయిన సంఘటన నాపై తీవ్ర ప్రభావమే చూపింది. నన్ను నేను తీర్చిదిద్దుకొనేందుకు అడుగడుగునా సహాయ పడింది. ఆ ‘అల్మారా’ గుణపాఠం ఆసక్తికరమేకాక అందరికీ ఉపయోగకరం కూడా.
గౌలిపురలో ఉన్నప్పుడు ఒక మిత్రుని ఇంటికి వెళ్లి వస్తూ, ఒక ఫర్నీచర్ దుకాణానికి వెళ్లాను. ఏనుగులాగా బలమైన ఒక ‘అల్మారా’ నా కంట పడింది. దాని వెల ‘రూ.600’ అని చెప్పాడు దుకాణదారు. జేబులోంచి పర్సు తీసి డబ్బియ్యబోయాను. ఇంతలో నా మిత్రడొకడు అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు.
“ఏం కొంటున్నారు?” అడిగాడు.
“600కు అల్మారా బేరం చేశాను..” చెప్పాను. అతడు ఏం ఆలోచించాడో గాని,
“ఓ ఇరవై రూపాయలు తక్కువ జేసి ఇమ్మనండి..” అన్నాడు.
నేను నా మిత్రుని మాటమీదే నిలబడ్డాను. కానీ, దుకాందారు ఒక్క పైసకూడా తగ్గించనన్నాడు. నేను పట్టిన పట్టు వీడలేదు. దాంతో, ఆ ‘అల్మారా’ను కొనలేక పోయాను. ఈ సంఘటన జరిగి నేటికి 50 ఏళ్లవుతున్నది. ఇప్పటికీ ఆ అల్మారా నా కళ్ల ముందాడుతున్నది.
వారాశిగూడకు నా ఠికానాను మార్చా క మరో అల్మారాను రూ.1200కు కొన్నా ను. ఐనా, మొదటి అల్మారా నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. 20 రూపాయలకు భయపడి అల్మారాను కొననం దుకు, అది నాకు కల్గించిన ‘జ్ఞానోదయం’ నిజంగా వెలకట్టలేనిది. ఒక వస్తువు మనకు నచ్చి, కొనాలనుకున్నప్పుడు, అంతరాత్మ ప్రబోధం మేరకు కొనేయాలి, అంతే. అలా కాక, విరుద్ధంగా పోతే, ఒక్కోసారి జీవితంలో ఏదో పోగొట్టుకున్నా మన్న న్యూనతా భావానికి లోనవుతాం.
వస్తువు ఏదైనా మనకు నచ్చనప్పుడు ఎంత తక్కువకైనా తీసుకోనక్కర్లేదు. నా మొదటి అల్మారా నాకు నేర్పిన పాఠం ఇది. ఈ ‘అల్మారా ఉపదేశం’ నాకు జీవితంలో చాలా ఉపయోగపడింది. ఇంటి స్థలంతోపాటు ఇల్లాలినీ ప్రసాదించింది.
అప్పట్లో నేను, ప్రమీల (ధర్మపత్ని)ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న సమయంలో “కట్నం క్యాష్ రూపంలో ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తమ అమ్మాయిని చేసుకుంటే..” అని ఒక బంధువు నన్ను ఇబ్బంది పెట్టాడు. కానీ, ‘నచ్చిన దాన్ని విడిచి పెట్టవద్దు’ అని ఆ మొదటి అల్మారా పదేపదే చేసిన హెచ్చరికను కాదనలేదు. అప్పటినుంచీ నచ్చని దాన్ని స్వీకరించే ప్రశ్నే నాకు ఉద్భవించలేదు. ‘మల్లి పదాలు’లో ఇదే చెప్పాను కూడా. “మనసు నచ్చని పిల్ల/ మమత కూర్చుట కల్ల/ తాను మెచ్చని దెల్ల/ దండగే మల్లీ!”-
వారాశిగూడలో రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం. ఒకరోజు పాలు పోసే వ్యక్తి, “సార్! ఇక్కడ అమ్మడానికి కొన్ని ప్లాట్లున్నాయి. మీకు కావాలంటే చూపిస్తాను. వస్తారా?” అన్నాడు.
అప్పటి దాకా ప్లాటు కొనాలని గాని, ఇల్లు కట్టాలని గాని అనుకోలేదు. “సరే, ఒకటి రెండు రోజుల తర్వాత చూస్తా ను..” అన్నాను. “సార్, ఒక ప్లాటు చాలా బాగుంది. డెబ్బయి రూపాయలకు గజం. అది 165 గజాల ప్లాటు. పన్నెండు వేలలో వస్తుంది. పోతే దొరకదు..” అన్నాడు మళ్లీ.
ఇంటివాణ్ణి కావడం వెనుక!
నాకు వెంటనే మొదట కొందామనుకున్న అల్మారా గుర్తుకు వచ్చింది. అంతే! “చూద్దాం పద” అని అతని వెంట ప్లాటు దగ్గరికి వెళ్లాను. బుద్ధుని గుడికి సమీపం లో ఇండ్ల మధ్యన ఎత్తయిన స్థలంలో ఉన్న ఆ ప్లాటు నాకు బాగా నచ్చింది. ఎవరినైనా అడిగితే, ‘వారు చెప్పినట్లు వినవలసి వస్తుందని’, వెంటనే ఇంటికి వచ్చి రూ. 200 బయానా ఇచ్చి, ప్లాటు యజమానితో ఒప్పందం చేసుకున్నాను.
“అయ్యో, అన్నకు, నాన్నకూ చెప్పకుండానే ఈ పని చేస్తున్నానే..” అనే అనిపించక పోలేదు. కానీ, ‘నీకు నచ్చింది, తీసుకునే అధికారం నీకు లేదా?’ అని మనస్సు హెచ్చరించే సరికి మిన్నకుండి పోయాను.
పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకు ముందురోజు మా అన్న, నాన్న వచ్చి ప్లాటు చూసి, బాగుందన్నారు. వారు “ఎందుకు తీసుకుంటావురా?” అని నన్ను నిరుత్సాహ పరచనందుకు భగవంతునికి మనస్సులోనే నమస్సులర్పిం చాను. ఇంటిస్థలం మా అన్నకూ బాగా నచ్చింది. అందుకే, మా నాన్నతో అడిగించాడు, ‘దానిలో సగం తనకు ఇమ్మని’. ఆరు వేలు నావి, ఆరు వేలు అన్నయ్యవి. ‘సగం ప్లాటు తీసుకుంటే, వెంటనే ఇల్లు కూడా కట్టుకోవచ్చు’ అనుకున్నాను. ఇద్దరి పేరుమీద ప్లాటు రిజిస్ట్రేషన్ అయ్యింది.
ప్లాటు కొనగానే ముందు రేకులతో, తర్వాత అంచెలంచెలుగా ఇల్లు నిర్మించుకున్నాను. 1979లో నూతనంగా గృహ ప్రవేశం చేసిన నేను 2004 దాకా (ఇరవై ఐదేళ్లపాటు) ఆ ఇంట్లోనే వున్నాను. ముచ్చటగా మూడు చోట్ల అక్కడ్నించే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాను. తెలు గు పండితునిగా, లెక్చరర్‌గా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా రాణించడానికి ఆ ఇల్లే నాకు అవకాశమిచ్చింది.
ప్రగతి మహావిద్యాలయంలో ఎనిమిదేళ్లు లెక్చరర్‌గా పని చేసినందుకు 1989లో ఆ సంస్థ నుంచి రూ. 20,000 (పిఎఫ్) సొమ్ము అందింది. ఎక్కడైనా కొంచెం పెద్ద ప్లాటు కొనాలనుకొన్నాను. ఒక స్నేహితుని సహాయంతో బోడుప్పల్‌లో స్థలం చూశాను. అప్పుడు కూడా మొదటి అల్మారా స్మృతిలో మెదిలింది. నాకు నచ్చింది కాబట్టి, పోగొట్టుకోవడం ఇష్టం లేక, వెంటనే రూ. 500 ఇచ్చి, ‘రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేయమని’ కోరాను.
దానిని నా అర్థాంగి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాను. 20,000కే 267 గజాల స్థలం వచ్చింది. వారాశిగూడలో రైలు కంపార్ట్‌మెంటు లాగా మూడు గదుల్లో ఉన్న నేను బోడుప్పల్‌లో ఒక సువిశాలమైన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఇలా నా మనస్సు అన్ని విషయాల్లోనూ ‘ఇలా చెయ్యి’ అని చెబుతూనే ఉంది. అది నాకెన్నడూ అన్యాయం చేయలేదు. అల్మారా గుణపాఠాన్నీ నేను మరవలేదు.
-వ్యాసకర్త సెల్: 9885654381