calender_icon.png 27 December, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవన సంస్కారం

02-08-2024 12:00:00 AM

మనలనందరినీ, ముఖ్యంగా ప్రస్తుతం చదువుకొంటూ వుండి, త్వరలోనే బడి విడిచిపెట్టి బయటకు పోయి ప్రపంచా న్ని ఎదుర్కొన వలసిన విద్యార్థులను ఎదుర్కొనే పెక్కు సమస్యలలో ‘సంస్కరణ’ ఒకటి. వివిధ వర్గాల ప్రజలు సమాజవాదులు, సామ్యవాదులు ఇంకా రకరకాలైన సంస్కర్తలు ప్రపంచంలో, స్పష్టంగా అవసరమని తెలిసిన కొన్ని మార్పులను తేవడానికై శ్రద్ధగా ప్రయత్నిస్తున్నారు. ఏవో కొన్ని శ్రేయోరాజ్యాలు ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఇంకా ఆకలి చావు లు, పస్తులు తప్పడం లేదు. లక్షలాది ప్రజలకు కట్టుకోడానికి తగినంత గుడ్డ లేదు, నిద్ర పోవడానికి తగినంత స్థలం లేదు. ఇందుకోసం, మరికొంత సంక్షోభం, మరికొంత దుఃఖం, మరికొంత సంఘర్షణ కలిగించనటువంటి సంస్కరణల ద్వారా సమూల పరివర్తనం తేగలమా? అది ఎలా సాధ్యం? 

చిన్న బడిలోగాని, పెద్ద విశ్వవిద్యాలయంలోగాని, ఊహల రూపంలో గాకుండా, మాటలతో సిద్ధాంతాలతో గాకుండా, కేవలం తర్కవితర్కాలతో గాకుండా, దాని గురించి పుస్తకాలు రాయడం ద్వారా గాకుండా, నేరుగా ఆ సమస్యను ఎదుర్కొనడం ద్వారా దానిని పరిష్కరించే మార్గమేదో తెలుసుకోవడం తప్పకుండా విద్యకు సంబంధించిన కర్తవ్యం. సంస్కరణ అనే ఈ విష వలయంలో మనిషి చిక్కుకొన్నాడు. ఇందులో ఒక సంస్కరణ మరొక సంస్కరణకు దారి తీస్తూనే వుంటుంది. ఇటువంటి ఈ విష వలయాన్ని ఛేదించకతే మన సమస్యలకు పరిష్కారముండదు. మరి, ఈ విషవలయాన్ని ఛేదించడానికి ఎలాంటి విద్య కావాలి? ఎటువంటి ఆలోచనా విధానం అవసరం? మనం చేసే పనులన్నిటిలోను సమస్యలు వృద్ధి పొందకుండా వుండాలంటే వాటిని మనమెలా ఆచరణలో పెట్టాలి? ఒక సంస్కరణ మరొక సంస్కరణకు దారితీసేలా ఈ జీవిత విధానం నుండి విముక్తినీయగల ఆలోచనా సరళి-. అది ఏ దిశగా పోయేదైనా ఉందా? దానినే మరొక విధంగా చెబితే, ప్రతిక్రియ నుండి పుట్టని ఆచరణ అంటూ ఉన్నదా?

అధిక దుఃఖానికి దారితీసేటటువంటి ఈ సంస్కరణ ప్రక్రియే అవసరం లేని జీవిత విధానం ఒకటున్నదని నేననుకొంటున్నాను. అదే ‘ధార్మిక జీవనం’. ధార్మికుడైన వ్యక్తికి సంస్కరణంతో సంబంధం లేదు. సాంఘిక జీవనంలో కేవలమేదో మార్పును తీసుకొని రావడంలో అతనికి శ్రద్ధ లేదు. పైగా, అతడు సత్యాన్వేషకుడు కాబట్టి, అతని సత్యాన్వేషణయే సంఘాన్ని మార్చి వేయగల శక్తి గలది. విద్యార్థికి గూడ సత్యాన్వేషణలో తోడ్పడమే విద్య ప్రధాన కర్తవ్యం. కేవలం తత్కాలంలో ఉన్న సంఘచట్రంలో ఇమడడం కోసం విద్యార్థిని తయారు చేయడం కానేకాదు. మరేమిటి! ఆలోచించండి.

 జిడ్డు కృష్ణమూర్తి 

(‘ఈ విషయమై ఆలోచించండి’ నుంచి..)