calender_icon.png 21 November, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక మహోత్సవ్.. లోక్ మంథన్

21-11-2024 12:28:26 AM

  1. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు
  2. శిల్పారామం వేదికగా నిర్వహణ
  3. హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రులు, గవర్నర్లు

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని శిల్పారామం ‘లోక్ మంథన్’కు వేదిక కానున్నది. గురవారం నుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం జరుగనున్నది.

కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. దక్షిణాదిలో తొలిసారిగా జరిగే ఈ ఉత్సవాల్లో 12 దేశాలకు చెందిన సాంస్కృతిక ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తారు.

తొలిరోజు వేడుకలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచ్చేయనున్నారు. ముగింపు కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సందేశమివ్వనున్నారు.

అనేక దేశాల ప్రతినిధుల రాక..

భారత సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా కేచక్ నృత్యాని ప్రదర్శించనున్నారు. అబ్రాహామిక్ మతాలకు ముందున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌లో పాల్గొంటారు. సిరియాకు చెందిన రోమోలు, ఆర్మేనియాకు చెందిన యజిదీలు, లిథువేనియన్స్ సైతం హాజరవుతున్నారు.

అబ్రాహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాల్లో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో ప్రదర్శిస్తారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యంపై చర్చలు ఉంటాయి.

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా...

దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే విధంగా లోక్‌మంథన్ కార్యక్రమ నిర్వహణ ఉంటుంది. జీవన దృష్టి, జీవన విజ్ఞానం, సాహిత్యం, అర్థశాస్త్రం, పర్యావరణం, కళలు,  సంస్కృతి, విద్య తదితర అంశాలపై సదస్సులు జరుగుతాయి. విద్యార్థులు, యువతరం దృష్టి సారించేలా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది.

కళలు, మీడియా, రాజకీయాల ద్వారా దేశంలో జరుగుతున్న విభజన పూరిత రాజకీయాలపైనా లోక్‌మంథన్ ప్రధానంగా చర్చిస్తుందని ఇప్పటికే కేంద్ర మంత్రి, స్వాగత కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి ప్రకటించారు. యువతలోని ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా లోక్ మంథన్ ఉంటుంది. 

కులం, మతం, భాష, వేషం, ఆచార వ్యవహారాలు ఇలా అనేక రకాలుగా ప్రజలను విభజించే దుర్మార్గపు పరిస్థితులున్న నేటి సమయంలో రాజకీయాలకు అతీతంగా జాతీయత భావజాలంతో కార్యక్రమం కొనసాగనున్నది.