అభినందించిన పిఓ రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఏజెన్సీ గిరిజన గ్రామాలలో కరెంట్ సౌకర్యం లేని పంట భూములలో బోర్వెల్ వేసుకొని ప్రత్యామ్నాయంగా సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుకొని సంవత్సరానికి రెండు పంటలు పండించుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిపల్లి మండలం బొజ్జలగూడెం, లక్ష్మీపురం, బంగారుచలక, గ్రామంలోని రైతులు కరెంటు సౌకర్యం లేకపోవడం వలన సోలార్ ద్వారా బోర్వెల్ పంపు సెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించుకొని పంటలు పండిస్తున్న వారి పంట పొలాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరెంటు సౌకర్యం లేక చాలామంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు పండించుకుంటున్నారని, చాలా గ్రామాలలో గిరిజనుల పంట పొలాలు నీటి సౌకర్యం లేక బీడు భూములుగా మారిపోతున్నాయని అన్నారు. ఈ గ్రామంలోని రైతులు సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుకొని పంటలు పండించుకోవడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా రైతులను అభినందిస్తూ, ఈ ఆలోచన ఎవరి ద్వారా వచ్చిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా గ్రామంలో నీటి సౌకర్యం లేక పంటలు పండించలేక చాలా భూములు బీడు భూములుగా మారిపోయాయని, 2017- 18 సంవత్సరంలో రెడ్ కో సంస్థ వారు గిరిజన రైతులకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇచ్చి సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ముందుకు రావడంతో గ్రామంలోని రైతుల అందరం కలిసి బోర్ వెల్స్ తవ్వించుకున్నామని, ఈ బోర్వెల్స్ కి సోలార్ ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో సంవత్సరానికి రెండు పంటలు పండించుకుంటున్నామని, దాదాపు పది ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నామని అన్నారు.
సోలార్ తో పాటు మా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తే తప్పనిసరిగా పంటలు విరివిగా పండించుకొని మా భూములు సస్యశ్యామలము అయ్యేలా చూసుకుంటామని రైతులు పీవో కి తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, మైనింగ్ ఏ డి ఈ రమేష్, రెడ్కో జిఎం అజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ రఘురామయ్య, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ ఏఈ మునీర్ పాషా ఫారెస్ట్ జాయింట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.