calender_icon.png 18 October, 2024 | 7:45 AM

వాడపల్లిలో రేషన్ బియ్యం పట్టివేత

18-10-2024 01:55:39 AM

  1. రెండు లారీల్లో 55 టన్నులు స్వాధీనం
  2. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్ 

నల్లగొండ, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు లారీల్లో తరలిస్తున్న సుమారు 55 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజుతో కలిసి మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిఘా పెట్టి వాహనాలను తనిఖీ చేశారు.

ఏపీ నుంచి తెలంగాణ వైపు వస్తున్న రెండు లారీల్లో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి లారీలను సీజ్ చేశారు. దందాతో సంబంధం ఉన్న బాపట్లకు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుధాకర్ గుంటూరు, బాపట్ల, నరసరావుపేటలో పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తన మిల్లులో పాలీష్ చేసేవాడు.

బియ్యాన్ని 25 కిలోల సంచుల్లో ప్యాక్ చేసి నకిలీ బిల్లులు సృష్టించి గుంటూరుకు చెందిన ఏజెంట్ అశోక్ సాయంతో పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. పట్టుబడిన రెండు లారీల్లో ఒకటి ముంబై వెళ్తున్నట్టు ఎస్పీ తెలిపారు.