calender_icon.png 27 December, 2024 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్బరీ తోటల సాగును ప్రోత్సహించాలి

05-11-2024 01:06:21 AM

  1. పట్టు పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలి
  2. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో మల్బరీ తోటల సాగును ప్రోత్సహించాలని, తద్వారా పట్టు పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం పట్టుపరిశ్రమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడి పెట్టి అధిక రాబడి పొందవచ్చని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రెండు ఎకరాల్లో మల్బరీ తోటలు పెంచుతూనే రైతులు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. సమగ్ర సిల్క్ పథకం నిధులను సద్వినియోగం చేసుకొని అన్ని జిల్లాలలో పట్టు పరిశ్రమ విస్తరించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విత్తన క్షేత్రాల్లో నాణ్యమైన మల్బరీ మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టస్సర్ పట్టు గుడ్ల ఉత్పత్తిలో సెంట్రల్ సిల్క్ బోర్డుపైనే ఆధారపడకుండా స్థానికంగానూ గుడ్లు ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2025- 26లో ఔత్సాహిక రైతులందరికీ గుడ్లు పంపిణీ చేయాలన్నారు.

టస్సర్ పరిశ్రమపైప్రత్యేక దృష్టి సారించి, రైతులకు అవసరమైన సాంకేతిక సాయాన్ని అందించాలని సూచించారు. గతప్రభుత్వం పదేళ్ల పాటు పట్టు పరిశ్రమశాఖకు నిధులు కేటాయించలేదని మంత్రి మండిపడ్డారు. పట్టు పరిశ్రమ పరిధిలో రీలింగ్, ట్విస్టింగ్ పరిశ్రమలను ప్రోత్సహించి ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చనే విషయాన్ని విస్మరించిందన్నారు.

తమ ప్రభుత్వం అలా చేయబోదని స్పష్టం చేశారు. పట్టుపరిశ్రమశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. పట్టుగూళ్లు ఉత్పత్తి చేసిన రైతులకు కిలోకు  రూ.75 చొప్పున సొమ్ము అందజేస్తుందన్నారు.

ఊపందుకున్న పత్తి కొనుగోళ్లు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. కొద్దిరోజులు మందకొడిగా సాగిన కొనుగో లు ప్రక్రియ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం నిర్వహించిన సమీక్షా సమావే శంతో యంత్రాంగం కదిలింది. సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా105 కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించింది.

కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే 1,474 మంది రైతులు 3,400 టన్నుల పత్తిని విక్రయించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని సూచించారు. ప్రైవేటు సంస్థలు, దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంట విక్రయించి నష్టపోవద్దని హితవు పలికారు.