06-04-2025 12:23:32 AM
ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు మోహన్ గురుస్వామి
కడ్తాల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : నాణ్యమైన విత్తనాలతోనే పంటలు బాగుంటాయని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్,భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
గడిచిన 50 సంవత్సరాలను పరిశీలించినట్లయితే వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న 1,20,000 వరి రకాల స్థానంలో కేవలం నేడు 3000 రకాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సువాసన భరిత చిట్టి ముత్యాలు లాంటి వరి వంగడాలు కనుమరుగయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనాభివృద్ధి పట్ల కృషి జరగడం లేదని, విత్తన పరిశోధనకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాని కోరారు.
విత్తనాల పండుగలో జరగబోయే కార్యాచరణ కమిటి ద్వారా తీర్మానాల్లో మోహన్ గురు స్వామి చెప్పిన సూచనలు ప్రవేశ పెడుతాం అని అన్నారు. సంస్థలతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొనవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా మాజీ కమిషనర్ ఆర్టీఐ,ఆర్. దిలీప్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మ రెడ్డి,రైతులు,విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు,డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.