calender_icon.png 27 September, 2024 | 4:53 AM

సాగు చట్టాలను మళ్లీ తేవాలి

25-09-2024 04:24:36 AM

బీజేపీ ఎంపీ కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. రైతుల ఆందోళనల కారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

రైతులకు మేలు చేసే ఈ చట్టాలను తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చేయాలని కోరారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం మండీలో కంగనా మాట్లాడుతూ.. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలనడం వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి.

కేవలం కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్తంభాలు. వారి ప్రయోజనాల కోసం వాటిని తిరిగి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకోసం రైతులే డిమాండ్ చేయాలి అని అన్నారు.

కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తూ.. తాము ఎప్పటికీ దాన్ని జరగనివ్వమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఆ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే 750 మందికిపైగా రైతులు అమరులయ్యారని పేర్కొన్నారు.