02-04-2025 05:43:07 PM
చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అన్నదాతలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగు సలహాలు, మెలకువలు అందించడం జరుగుతుందని రైతులు అధికారుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ కోరారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదిక ఆవరణలో బుదవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివిధ రకాల పంటల సాగులో రైతులు విరివిగా సాంకేతిక పరమైన సలహాలు కేవలం వ్యవసాయ అధికారుల నుండి మాత్రమే పొందాలని ఆన్నారు.
పంటల సస్యరక్షణ చర్యల్లో సలహాలు, సూచనలు అందించడానికి వ్యవసాయ శాఖ అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పాటు ప్రతి సీజన్ లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అమలు చేయబడే డిజిటల్ పంటల నమోదుకు రైతులు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ది పొందుటలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మండల పరిధిలోని అధికారులను సంప్రదించాలని, పంట మార్పిడికి రైతులు సహకరించాలని సూచించారు.
పంట మార్పిడి ద్వారా భూసారం కాపాడుకోవడమే కాకుండా చీడ పీడలకు ఆవాసం కాకుండా పంటలను కాపాడుకోవచ్చని, ఆహార ధాన్యాల కొరతను అధిగ మించవచ్చని తెలిపారు. తర్వాత ఆయిల్ పామ్ పంట ప్రయోజనాల గురించి అడవి పందుల బారి నుండి పంటలను కాపాడుకొను విధానాల పైన, అడవి పందుల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు లతో పాటు రైతులు ఐలయ్య, రాజిరెడ్డి, లింగారెడ్డి, గోలెం మల్లేష్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.