calender_icon.png 3 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్‌లో గోదావరి నీటితో సాగు చర్యలు

31-03-2025 12:00:00 AM

ఆగస్టు 15 నాటికి జాతీయ రహదారి పనులు పూర్తి

లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి 

వేంసూరు మండలం కల్లూరు గూడెంలో నూతన ఆయిల్ పామ్ కర్మాగారానికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు శంకుస్థాపన 

ఖమ్మం, మార్చి -30 (విజయక్రాంతి): -వర్షాలతో సంబం ధం లేకుండా ఖమ్మం జిల్లా రైతులు జాన్ నెలలో గోదావరి జలాలతో సాగు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఆదివారం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, టి.జి. ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డిలతో కలిసి నూతన ఆయిల్ పామ్ కర్మాగార పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయని, ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చే ఏ మొక్కలు కూడా కల్తీవి లేవని, నర్సరీ దశలోనే కల్తీ మొక్కలు కనిపెట్టడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లిలో అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టడం జరుగుతుందని అన్నారు. వేంసూరు మండలంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గతంలో ఎన్టిఆర్ కాలువ పూర్తి చేశామని అన్నారు.  రాజీవ్ లింక్ కాలువ పూర్తి చేసి వైరా నియోజకవర్గ పరిధిలో సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించామని అన్నారు.జూన్ నెలలోపు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొని వస్తామని, నాగార్జున సాగర్ నిండకపోయినా గోదావరి నీటితో వేంసూరు మండల చెరువులు నింపు తామని అన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల పథకం నీటి సరఫరా చేసేందుకు పెండింగ్ పనులకు సవరించిన అంచనాలను సీఎం ఆమోదించారని అన్నారు.

 జాతీయ రహదారుల పై దృష్టి 

జాతీయ రహదారుల, ఆయిల్ పామ్ పంటల వృద్ది ఖమ్మం జిల్లాను చూసి ఇతర జిల్లాలు నేర్చుకోవాలని అన్నా రు.  ఖమ్మం నుంచి 33 నిమిషాలలో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరు జాతీయ రహదారి ఎగ్జిట్ ఏర్పాటు చేశామని, ఆగస్టు 15 నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని అన్నారు.

రూ. 33 వేల కోట్లు ఖాతాల్లో జమ 

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తూ రైతుల ఖాతాలలో 33 వేల కోట్లను సీఎం రేవంత్ రెడ్డి జమ చేశారని అన్నారు. రైతు భరోసా భవిష్యత్తులో ఇచ్చిన హామీ మేరకు చేస్తామని అన్నారు. పంటల భీమా పథకం త్వరలోనే ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఎటువంటి కారణాలతో పంట నష్టపోయినా పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు గిట్టుబాటు ధర 21 వేలు దాటే విధంగా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు.  హార్టికల్చర్ వ్యవసాయ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కువ ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభమైందని, రాబోయే 10 సంవత్సరాలలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని మంత్రి తెలిపారు.

కార్యక్రమం లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్,టి.జి.ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా,ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖల అధికారులు, తెలంగాణ, ఆంధ్రా ఆయిల్ పామ్ అధ్యక్షులు, ప్యాక్స్ డైరెక్టర్ లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.