calender_icon.png 5 November, 2024 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నై రేసులోనే

13-05-2024 12:57:10 AM

ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

రాజస్థాన్‌పై 5 వికెట్లతో విజయం  

రాణించిన సిమర్‌జీత్, రుతురాజ్

సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మెరిసింది. సీజన్‌లో హోంగ్రౌండ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన చెన్నై.. రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గి ఏడో విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతుండడంతో స్టేడియం మొత్తం పసుపు రంగు పులుముకుంది. స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మార్మోగిన వేళ మొదట చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించి రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ ఫామ్ కొనసాగిస్తూ సొంతగడ్డపై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు. చెన్నైతో మ్యాచ్‌లో గెలిచి దర్జాగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాలనుకున్న రాజస్థాన్‌కు మరోమారు నిరాశే ఎదురైంది.

చెన్నై : ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో సమీర్ రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) చెన్నైని గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2, బర్గర్, చహల్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ (18 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు), జైస్వాల్ (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో సిమర్‌జీత్ సింగ్ 3, తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు పడగొట్టారు. బౌలింగ్‌లో మెరిసిన సిమర్‌జీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‘ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో 14 పాయింట్లు సాధించిన చెన్నై ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న రాయల్స్ ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

చెపాక్‌లో చెన్నై సంబరాలు..

తాజా సీజన్‌లో సొంతగడ్డపై ఇదే చివరి మ్యాచ్ కావడంతో మహేంద్రసింగ్ ధోనీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి తరలివచ్చారు. దీనికి తగ్గట్లే మ్యాచ్ ఆరంభానికి ముందు చెన్నై ఫ్రాంచైజీ.. ‘మన సూపర్ ఫ్యాన్స్‌కు ఒక విజ్ఞప్తి.. మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియంలోనే ఉండండి. మీ కోసం ఒక స్పెషల్ రెడీ అవుతోంది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ధోనీ కెరీర్‌కు సంబంధించి ఏదైనా కీలక ప్రకటన వస్తుందేమో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్లేయర్లకు మెడల్స్ బహుకరించింది. దీంతో పాటు.. చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌కు చివరి మ్యాచ్ కావడంతో ధోనీతో పాటు.. సీఎస్కే ప్లేయర్లు తమ అభిమానులను అలరించేందుకు మ్యాచ్ అనంతరం బంతులు విసిరారు. మైదానం మొత్తం కలియతిరిగిన చెన్నై ప్లేయర్లు టీషర్ట్‌లు, బంతులు స్టాండ్స్‌లోకి విసిరారు. వీటి కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇక సీజన్ మొత్తం మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు సహకరించిన మైదాన సిబ్బందితో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫొటోలు దిగాడు. 

సంక్షిప్త స్కోర్లు

రాజస్థాన్: 20 ఓవర్లలో 141/5 (రియాన్ పరాగ్ 47 నాటౌట్; సిమర్ జీత్ 3/26, తుషార్ 2/30), 

చెన్నై: 18.2 ఓవర్లలో 145/5 ( రుతురాజ్ 42 నాటౌట్; రచిన్ రవీంద్ర 27; అశ్విన్ 2/35) 

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

కోల్‌కతా 12 9 3 1.42 18

రాజస్థాన్ 12 8 4 0.34 16

చెన్నై 13 7 6 0.52 14

హైదరాబాద్ 12 7 5 0.40 14

బెంగళూరు 1౩ 6 7 0.38 12

ఢిల్లీ 13 6 7 12

లక్నో 12 6 6 12

గుజరాత్ 12 5 7 10

ముంబై 13 4 9 8

పంజాబ్ 12 4 8 8

నోట్: మ్యా గె-గెలిచినవి, ఓహాఓడినవి, ర.రే పావూ