calender_icon.png 14 January, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఈ సీటు హాట్ కేకు!

04-08-2024 01:37:27 AM

  1. ఇంజినీరింగ్ కాలేజీని బట్టి పలుకుతున్న రేట్లు
  2. ఒక్కో సీటుకు రూ.5 నుంచి 18 లక్షలు 
  3. బీ-క్యాటగిరి నోటిఫికేషన్‌కు ముందే సగంపైగా సీట్లు బుక్
  4. నిబంధనలు పాటించని కాలేజీలు, నియంత్రించని అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): “ఓ విద్యార్థికి ఎప్‌సెట్‌లో 60 వేల వరకు ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్‌లో పాల్గొన్నాడు. సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), దాని అనుబంధ కోర్సులకు సంబంధించి హైదరాబాద్‌లోని పేరున్న కాలేజీలకు ఆప్షన్లు పెట్టుకున్నాడు. మొదటి విడుతలో కీసరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సీఎస్‌ఎం సీటు వచ్చింది. అయితే అది ఓ మోస్తారు కాలేజీ కావడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు అందులో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో మంచి పేరున్న కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కోసం ప్రయత్నించి చూద్దామని ఫీజు వివరాలు అడిగితే వారి కళ్లు బైర్లు కమ్మాయి. సీఎస్‌ఈ సీటుకు డొనేషన్ 14 లక్షలు కట్టమన్నారు. దీనికి అదనంగా ఏడాదికి రూ.1.5 నుంచి రూ.2 లక్షల ఫీజు. మళ్లీ హాస్టల్ ఫీజు వేరు. దీంతో ఏం చేయాలో తెలియక ఆలోచించుకొని తర్వాత చెప్తామన్నారు.”

ఇది హైదరాబాద్ నగరంలోని కేవలం ఒక కాలేజీ గురించి మాత్రమే. అదే ఇతర ప్రముఖ కాలేజీలో సీటు కావాలంటే రూ.5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు.. ఇలా డొనేషన్లు చెల్లించాల్సిందే. వీటికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసే కాలేజీలూ ఉన్నాయి. నిబంధనల మేరకు పేపర్ మీద ఉండే ఫీజు ఒకటైతే.. ఇలా డొనేషన్ల పేరుతో దోచేస్తున్నారు. ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు ఇటీవలే పూర్తయింది. మొదటి, రెండో విడుతల్లో వారు కోరుకునే సీటు దొరకని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మేనేజ్‌మెంట్ కోటా వైపు మక్కువ చూపిస్తున్నారు. కేవలం సీఎస్‌ఈ, సీఎస్‌ఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తేనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయనే భావనతో వాటికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. దీంతో ఎంత ఖర్చు అయినా మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను దక్కించుకుంటున్నారు.

నోటిఫికేషన్‌కు ముందే 

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా, 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా (బీ భర్తీ చేస్తారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. కానీ అవేం పాటించకుండా ముందే బేరసారాలు చేసేస్తున్నారు. జూలై 31న మార్గదర్శకాలను విడుదల చేసి ఈనెల 29లోగా సీట్లు భర్తీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు భర్తీ ప్రక్రియను దాదాపు పూర్తి చేసినట్లు తెలిసింది. డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ, దాని అనుబంధ సీట్లు నిండినట్లు సమాచారం. అడ్వాన్స్‌గా కొంత డబ్బులు చెల్లిస్తే కావాల్సిన సీట్లను బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈసీఈ, ఈఈఈ కోర్సులకూ సీఎస్‌ఈ అంత కాకున్నా రూ.లక్షల్లోనే డొనేషన్లను వసూలు చేస్తున్నారు.

పాటించని నిబంధనలు...

మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో కొన్ని కాలేజీలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. సీట్లను భర్తీ చేయాలంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మూడు దినపత్రికల్లో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుల వివరాలను రోజూ కళాశాలలోని నోటీసు బోర్డులో, కాలేజీ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. ఇంటర్మీడియట్‌లో 45 శాతం, రిజర్వుడ్ క్యాటగిరి విద్యార్థులకు 40 శాతం మార్కులొచ్చిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 15 శాతం, యాజమాన్య కోటా కింద 15 శాతం సీట్లు భర్తీ చేయాలి. సీట్ల వివరాలను బ్రాంచ్‌ల వారీగా ప్రకటించాలి. జేఈఈ మెయిన్స్, ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లు మిగిలితే ఇంటర్‌లో మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. అది కూడా మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలి. ఈ వివరాలను ఈ నెల 10 లోపు తెలంగాణ ఉన్నత విద్యామండలికి పంపించాలి. కానీ ఈ ప్రక్రియను తూతూమంత్రంగా చేపడుతున్నారనే విమర్శలున్నాయి.