calender_icon.png 4 March, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా పటిష్ట చర్యలు

03-03-2025 08:52:34 PM

రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలి..

ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు..

యాసంగి సాగు నీటి సరఫరా, గురుకులాల సందర్శనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి..

సంగారెడ్డి (విజయక్రాంతి): చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు సరఫరా అందెలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి(State Chief Secretary Shanti Kumari) అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి యాసంగి సాగునీటి సరఫరా, నీటి పారుదలశాఖ పని తీరుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు(District Collector Kranthi Valluru), అదనపు కలెక్టర్ మాధురి(రెవెన్యూ), ట్రైనీ కలెక్టర్ మనోజ్ లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ... యాసంగి పంట సంరక్షణకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగునీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర పంట పొలాలకు చేరేలా చూడాలని, వ్యవసాయ శాఖకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని సిఎస్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.  

భారీ నీటి పారుదలశాఖ పరిధిలోని రిజర్వాయర్లలో అవసరమైన మేర సాగునీరు అందుబాటులో ఉందని, పంటలకు సమృద్ధిగా నీరు విడుదల చేయడం జరుగుతుందని, విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని అన్నారు. యాసంగిలో 77 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోందని, ముఖ్యంగా వరి పంట 54.82 లక్షల ఎకరాల సాగు జరిగిందని, గత సంవత్సరం కంటే 2 లక్షల 70 వేల ఎకరాలు వరి, లక్ష ఎకరాల మొక్కజొన్న పంట అధికంగా పండుతుందని అన్నారు. చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు రాక పోవడం, భూగర్భజలాలు తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రైతులు ఇబ్బందులకు గురికావడం గమనించామని అన్నారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటిచుక్కను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు.  

రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చే డిమాండ్ అనుగుణంగా సాగునీరు విడుదల చేస్తూ రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడాలని సిఎస్ ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎక్కడ లోటు రాకుండా చూసుకోవాలని సీఎస్ డిస్కం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న పీక్ డిమాండ్ కు మరో 10 నుంచి 15 శాతం పెరిగినా తట్టుకునెలా విద్యుత్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. సాగునీరు సరఫరా, పంటల పరిస్థితులపై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించాలని, రైతులు ఆందోళనకు గురికాకుండా సమృద్ధిగా సాగునీటి సరఫరా అవుతుందని భరోసా కల్పించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అన్నారు. రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ లెవెల్ లో రైతులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసిల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ ల తనిఖీ తర్వాత పరిస్థితులలో మార్పులు వచ్చాయని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెన్యూ డైట్ పక్కాగా అమలు అవుతుందని అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధం సంబంధించి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చర్యలు తీసుకోవాలని సిఎస్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్ గా చెక్  చేయాలని, జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్ లను తనిఖీ చేసేందుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ, ఇరిగేషన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.