30-03-2025 08:00:52 PM
హుజూర్ నగర్,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ... ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని, దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో కొత్తగా 30 లక్షల మందిని చేర్చనున్నామని, దీంతో సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2800 కోట్ల అదనపు భారం ఏర్పాడుతుందని సీఎస్ తెలిపారు.
ఈ పథకం అమలులో ఎంతో శ్రద్దవహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. సన్న బియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడి బియ్యం పక్కదారి ఆగిపోయి, కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అధనంగా అయ్యే ఖర్చు ఆదా అవుతుందన్నారు. లబ్ధిదారులందరూ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలందరూ మరోకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.