calender_icon.png 21 November, 2024 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిప్టోకరెన్సీపై ప్రచార హోరు

21-11-2024 01:33:47 AM

సుప్రియా సూలేపై బిట్‌కాయిన్ దుమారం

న్యూఢిల్లీ, నవంబర్ 20: అంతర్జాతీయం గా, దేశీయంగా బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీలు ప్రచార హోరు ప్రస్తుతం నడుస్తున్నది. యూ ఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత బిట్‌కాయన్ పెద్ద ర్యాలీ జరిపి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో సంచలనం సృష్టించింది. బుధవారం 94,000 డాలర్ల స్థాయిని అధిగమించింది. 

మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్‌సీపి నేత సుప్రియా సూలేలు ‘చట్ట విరుద్ధమైన బిట్‌కాయిన్ కార్యకలాపాలతో’ వారి ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో దేశీయంగా క్రిప్టోక రెన్సీ వార్తల్లో నలుగుతున్న ది. ఈ నేపథ్యం లో క్రిప్టోకరెన్సీ/బిట్‌కాయిన్ వివరాలు ఇవి..

క్రిప్టోకరెన్సీ: క్రిప్టోకరెన్సీ అనేది ఒక డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. దీనిని కంప్యూటర్ సిస్టమ్స్‌లో క్రిప్టోగ్రఫీ ద్వారా మైనింగ్ చేసి సృష్టిస్తారు. దీనికి నకిలీని తయారుచేయడం లేదా దీనిని రెండుసార్లు ఖర్చుచేయడం దాదాపు అసాథ్యం. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించే ఒక క్లిష్టమైన కంప్యూటర్ల నెట్‌వర్క్ ద్వారా నిర్వహింపబడే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్‌లో  క్రిప్టోకరెన్సీలు ఉంటాయి. 

బిట్‌కాయిన్: బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించే క్రిప్టోకరెన్సీల్లో బాగా గుర్తింపు పొందిన క్రిప్టో పేరే బిట్‌కాయిన్.

దశాబ్దకాలంగా ప్రాచుర్యం: ప్రైవేటు డిజిటల్ కరెన్సీలు/వర్చువల్ కరెన్సీలు/క్రిప్టోకరె న్సీలు గత దశాబ్దకాలంగా పాపులర్ అయ్యా యి. వివిధ దేశాల రెగ్యులేటర్లు, ప్రభుత్వాలు ఈ కరెన్సీల పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నా యి. వాటితో రిస్క్‌లు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి.

* క్రిప్టో కరెన్సీకి ఎటువంటి అంతర్గత విలువా లేదు. బంగారం తరహాలో మరో కమోడిటీ క్రిప్టోతో మార్చడం వీలుపడదు

* క్రిప్టోకరెన్సీకి భౌతిక రూపం ఉండదు. కేవలం నిర్దేశిత నెట్‌వర్క్‌లో మాత్రమే ఉంటుంది. 

* ఇతర కరెన్సీల్లా క్రిప్టోను ఏ కేంద్ర బ్యాంక్ సరఫరా చేయదు. అది ప్రొటోకాల్ ద్వారా సరఫరా అయ్యేది

చట్టబద్ధత: క్రిప్టోకరెన్సీలపై ఒక విధానాన్ని ప్రస్తుతం భారత్ రూపొందిస్తున్నది. అయితే క్రిప్టోను చట్టవిరుద్ధమైనదిగా కూడా ఇప్పటివరకూ వెల్లడించలేదు. అంతేకాకుం డా క్రిప్టోకరెన్సీల నుంచి పొందే లాభాలపై 30 శాతం అదాయపు పన్నును 2022లో ప్రభుత్వం ప్రకటించింది. క్రిప్టోకరెన్సీల ఆదాయంపై పన్ను విధింపు క్రిప్టోలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పరిగణించరాదు. 

దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటున్న ఆర్బీఐ: ప్రైవేటు క్రిప్టోకరెన్సీల వినియోగం దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుందని రిజర్వ్‌బ్యాంక్ గట్టిగా వాదిస్తున్నది. క్రిప్టో కరెన్సీకి ప్రత్యామ్నాయం గా డిజిటల్ రూపీ కరెన్సీలను ప్రస్తుతం ఆర్బీఐ జారీచేస్తున్నది. తన నియంత్రణలోని బ్యాంక్‌లు, సంస్థలు వర్చువల్ కరెన్సీలకు సంబంధించినవాటికి సర్వీసులు అందించకూడదంటూ 2018 ఏప్రిల్ 6న రిజర్వ్‌బ్యాం క్ జారీచేసిన సర్క్యులర్‌ను 2021 మార్చి 4న సుప్రీంకోర్టు కొట్టివేయడం గమనార్హం. 

ప్రస్తుతం కమిటీ పరిశీలనలో పాలసీ: క్రిప్టోకరెన్సీలపై ఒక విస్త్రత విధానాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, సెబీల అధికారులతో కూడిన కమిటీ పరిశీలిస్తున్నది. కమిటీ నుంచి చర్చాపత్రం విడుదల కావాల్సి ఉన్న ది. ఆ చర్చాపత్రం వచ్చిన తర్వాత దానిపై అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని క్రిప్టోకరెన్సీ భాగస్వాములకు ఇస్తారు. అటుతర్వాత క్రిప్టోకరెన్సీ విధానంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. 

భారత్‌లో నియంత్రణ

ప్రస్తుతం క్రిప్టో ఆస్తులకు భారత్‌లో నియంత్రణ లేదు. కానీ మనీలాండరింగ్ చట్టం ద్వారా క్రిప్టోకరెన్సీలను నియంత్రిస్తారు. బిట్‌కాయిన్ వంటి వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రేడింగ్ ద్వారా పొందే లాభాలపై అదాయపు పన్ను, టీడీఎస్ ఉంటుంది. ప్రైవేటుగా నడిచే క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌లపై జీఎస్టీని కూడా విధిస్తున్నారు. 

నిషేధం సాధ్యమేనా..

క్రిప్టో ఆస్తులను నిషేధించాలంటూ ఆర్బీఐ సిఫార్సుచేస్తున్నది. కానీ క్రిప్టోలు ఎటువంటి దేశ సరిహద్దులు లేకుండా ట్రేడయ్యే కరెన్సీలు అయినందున, అంతర్జాతీయ పరస్పర దేశాల అంగీకారం ద్వారా మాత్రమే వీటిపై నిషేధం సమర్థవంతంగా అమలవుతుంది.