- ప్రస్తుతం క్రిప్టో పరిశ్రమపై ఏమాత్రం ఆసక్తి లేదన్న
- బినాన్స్ వ్యవస్థాపకుడు జావో
ప్రపంచానికి అమెరికాను క్రిప్టోకరెన్సీ రాజధానిగా చేస్తానంటూ ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనంతనే క్రిప్టో కింగ్‌గా పేరొం దిన ‘సీజెడ్’ (చెంగ్‌పెంగ్ జావో) ఫ్యాన్స్ హర్షధ్వానాల మధ్య చిరునవ్వులు చిందిస్తూ దుబాయ్‌లో ఒక కార్యక్రమానికి వచ్చారు. సీజడ్‌తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ పెద్దఎత్తున క్యూ కట్టారు. కొద్ది నెలల క్రితమే యూఎస్ జైలు నుంచి తిరిగొచ్చిన క్రిప్టో కింగ్‌కు పెద్ద స్వాగతమే లభించింది. ఉత్సాహం పట్టలేని ఒక స్టార్టప్ కంపెనీ ప్రమోటర్ అయితే ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ గొంతెత్తి అరిచాడు.
అది కొంతవరకూ కరెక్టే! ట్రంప్ గెలుపు తర్వాత ప్రపంచంలో క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్, డిజికాయిన్ తదితర డిజిటల్ ఆస్తులు పెద్ద ర్యాలీయే చేస్తున్నాయి. కానీ ఇప్పుడు క్రిప్టో బిలియనీర్ అయిన సీజెడ్ తిరిగొచ్చింది ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్సేంజ్ బినాన్స్ హెడ్‌గా కాదు. ట్రంప్ గెలుపుతర్వాత సీజడ్ సంపద ఒక్కరోజులోనే 12 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకుపైగా) పెరిగిపోయింది.
ఇప్పుడీ క్రిప్టో బిలి యనీర్ సంపద 63 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.3 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఇప్పుడు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆయన 25వ స్థానానికి ఎగబాకారు. అందుకే జీజడ్ అంటే క్రిప్టో ఫ్యాన్స్‌లో అంత క్రేజ్.
బినాన్స్ వాటాకు ఆఫర్లొస్తున్నాయి
జావో సంపదలో అత్యధిక భాగం బినా న్స్ ఎక్సేంజ్‌లో ఆయన వాటానే. అందు లో 90 శాతం వాటా సీజెడ్ చేతిలో ఉన్నది. ఎక్సేంజ్‌లో తన వాటా కొంటామంటూ ఆఫర్లు వస్తున్నాయని, ప్రతీ ఆఫర్‌ను సమీక్షిస్తున్నానని జావో తెలిపారు. ‘ఎప్పటికీ నా వాటాను అట్టిపెట్టుకుంటానా లేదా అనేది చెప్పలేను’ అంటూ బ్లూంబర్ద్ ప్రతినిధికి చెప్పారు.
మస్క్‌తో బంధం బినాన్స్ సీఈవోగా జావో వైదొలగ ముందు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) టేకోవర్ చేయడానికి సీజెడ్ 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేశారు. మస్క్ సైతం క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి చేయడమే కాకుండా టెస్లా కార్ల కొన్నవారి నుంచి డాలర్ల బదులు క్రిప్టోలను స్వీకరిస్తానని ప్రకటించారు కూడా.
అంతేకాకుండా ట్రంప్‌కు భారీ ఎన్నికల విరాళాలు ఇచ్చినవారిలో మస్క్ ముందువరుసలో ఉన్నారు. తన ఎక్స్ వేదికను ట్రంప్ గెలుపునకు ఉపయోగించా రు. ఇప్పుడు క్రిప్టో మద్దతుదారు ట్రంప్ రెండో దఫా వైట్‌హవుస్‌లో ప్రవేశిస్తున్నందున, క్రిప్టోకరెన్సీ పరిశ్రమ వెలిగిపోతుందని అంచనా. తాజాగా జావో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ఏ క్రిప్టో కాయిన్లు కొనాలంటూ పలువురు అడుగుతుంటారని, గార్డులు కూడా టిప్స్ కోరుతుంటారని అన్నారు.
‘ఇప్పుడు నా వద్ద ఎటువంటి సమాచారం లేదు. మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉన్నదో కూడా నాకు తెలియదు’ అని బినాన్స్ ఎక్సేంజ్ వ్యవస్థాపకుడు వ్యాఖ్యానించారు. బినాన్స్ నిర్ణయాల్లో ఇప్పుడు తన పాత్ర ఏదీ లేదని, తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న కోరికా లేదని అన్నారు. బినాన్స్ నాయకత్వం చాలా అరుదుగా తన సలహాలను అడుగుతుందని,
కేవలం గతానికి సం బంధించిన అంశాలపైనే వారికి సూచనలు ఇచ్చేందుకు అంగీకరిస్తుంటానని తెలిపారు. బినాన్స్ సహ వ్యవస్థాపకురాలు యి హితో జావోకు పిల్లలు ఉన్నారు. యి హి ప్రస్తుతం కంపెనీలో కీలక బాధ్యతలు చూస్తున్నారు.
ప్రపంచంలోనే సంపన్న ఖైదీ
క్రిప్టో సొసైటీలో కింగ్‌గా మన్ననలను అందుకుంటున్న సీజెడ్‌ను నాలుగు నెలల క్రితం ప్రపంచంలోనే సంపన్న ఖైదీగా యూఎస్ టెలిగ్రాఫ్ పత్రిక అభివర్ణించింది. అమెరికా మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినట్లు జీజెడ్ అంగీకరించడంతో అక్కడి కోర్టు ఈ ఏడాది మే నెలలో నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. వాస్తవానికి జావోకు మూడేండ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఆయన దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిశీలించి జడ్జి తక్కువకాలం శిక్ష వేశారు.
సీజడ్ ఇప్పుడు జైలు నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చారు. కానీ ఆయన స్థాపించిన బినాన్స్ కంపెనీ పగ్గాలను చేపట్టలేరు. ఎందుకంటే యూఎస్ న్యాయశాఖతో చేసుకున్న ఒప్పందం మేర కు గత ఏడాది బినాన్స్ బాధ్యతల నుంచి వైదొలిగారు. లైసె న్సు లేని ఎక్సేంజ్ ద్వారా అమెరికావాసుల్ని ట్రేడ్ చేయడానికి అనుమతించి ఆంక్షలను ఉల్లఘించినందుకు బినా న్స్ 4.3 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) జరిమానాను సైతం చెల్లించేందుకు అంగీకరించింది.
తాను తిరిగి కంపెనీ బాధ్యతలు చేపడతానని అనుకోవడం లేదని జైలు నుంచి విడుదలైన సందర్భంగా సీజెడ్ మీడియాకు చెప్పారు. ‘ఏడేండ్లు బినాన్స్‌కు నేతృత్వం వహించా’. ఎంతో పని అయినా ఎంజాయ్ చేశా. అది ఒక ముగిసిన చాప్టర్’ అంటూ చెప్పుకొచ్చారు. ‘క్రిప్టోపై పుస్తకం రావడం, తోటి ఖైదీలతో క్రిప్టోపై మాట్లాడటం వంటివాటితో జైలులో టైమ్‌పాస్ చేశా’ అని చెప్పారు.
ఏఐ, బయోటెక్‌ల్లో పెట్టుబడులకు అన్వేషణ
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), బయోటెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నానని జావో చెప్పారు. లాభాపేక్షలేని ఎడ్యుకేషన్ యాప్ గిగిల్ అకాడమీ స్థాపిస్తున్నానని వెల్లడించారు.