- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమాయకుల బలి
- విద్యావంతులనూ నట్టేట ముంచుతున్న వైనం
- కొరఢా ఝుళిపిస్తున్న జగిత్యాల పోలీసులు
- రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల దందా?
కరీంనగర్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): కొన్నేండ్ల క్రితం గొలుసుకట్టు పేరిట సామాన్యులు సభ్యులుగా చేరి రూ.లక్షల్లో మోసపోయారు. తర్వాత ఆన్‌లైన్ మార్కెటింగ్ దందా అలాగే కొనసాగింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ దందా సామాన్యులతోపాటు విద్యావంతులనూ నట్టేట ముంచుతున్నది.
ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన ఈ దందా నేడు పల్లెలకూ పాకింది. అధిక ఆదాయం వస్తుందనే అత్యాశతో ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి అమా యకులు మోసపోతున్నారు. రూ.లక్ష నుంచి రూ.కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి. జవాబుదారితనంతోనే ఉంటుందని చెప్తుండటంతో నమ్మి మోసపోతున్నారు.
పలువురిపై కేసులు
జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య, కోయల్‌కర్ వేణు, ఆరె రాజేశ్, ఉదయ్‌బాబు, కొట్టె మారుతితోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాలలోని అరవింద్‌నగర్‌కు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని, డాలర్ల రూపంలో ఆదా యం వస్తుందని ఆశచూపడంతో చాలామంది చేరారు.
పెట్టుబడి పెట్టేవారికి తాము పూచికత్తుగా ఉంటామని నమ్మించారు. రోజుకు ఒక శాతం చొప్పున కమీషన్ వస్తుందని, సంవత్సరన్నరలో పెట్టుబడికి పది రెట్లు వస్తుందని నమ్మబలకడంతో ఉద్యోగులు, అధికారులు కూడా మోసపోయారు.
జగిత్యాలలో రూ.కోట్లలో దందా
జగిత్యాల జిల్లాలో క్రిప్టో కరెన్సీలో రూ. 500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో కాని స్టేబుల్ స్థాయి నుంచి అధికారుల వరకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, పలు వురు జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున ఈ మోసపూరిత చైన్ సిస్టమ్‌లో డిపాజిట్లు చేసినట్లు తెలుస్తున్నది.
పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో జగిత్యాల సీఐ వేణుగోపాల్ కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు ఈ దందాపై దృష్టిసారిస్తే మధ్య, పేద తరగతి ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది.
రాజకీయ నేతలూ ఉన్నారు?
కరీంనగర్‌కు చెందిన ఒక పార్టీ నాయకుడు ఏజెంట్‌గా చేరి తనకు పరిచయమున్న వారి నుంచి రూ.10 లక్షల మేర పెట్టుబడి పెట్టించడంతో మోసపోయిన బాధితులు డబ్బుల కోసం ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు ఏజెంట్లుగా చేరి రూ.కోట్లు ఆర్జించవచ్చనే ఆశతో అమాయకులను సభ్యులుగా చేర్చుకున్నారు.
తాజాగా వీటి అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నాటి గొలుసుకట్టు నుంచి నేటి క్రిప్టో కరెన్సీ వరకు బలైతున్న వారిలో సామాన్యులు, మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు.
ఏజెంట్లుగా అధికారులు, జర్నలిస్టులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ప్రాంతా ల్లో చాలామంది అమాయకులు బలవుతున్నారు. జగిత్యాలతోపాటు కొన్నిచోట్ల కొందరు పోలీస్ అధికారులు, ఉద్యోగు లు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ దందాలో చిక్కుకున్నారు. ఏజెంట్లుగా కొందరు అధికారులతోపాటు కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. జగిత్యాల పోలీసులు కొరఢా ఝుళిపిస్తుండటంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.