calender_icon.png 2 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చితికిపోతున్న పంచాయతీలు

06-07-2024 03:13:30 AM

    • సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి జీపీలు 
  • పడకేసిన పల్లె పాలన, కార్యదర్శులపై పెరిగిన ఒత్తిడి 
  • గత సర్కారు హయాం నుంచే నిధుల విడుదల బంద్ 
  • కాంగ్రెస్ వచ్చాక కూడా మారని పరిస్థితి

  • హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పల్లె, పట్టణ పాలన పడకేసిందని, వాటిని గాలికొదిలేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. అయితే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే పంచాయతీల పరిస్థితి దిగజారుతూ వస్తోందని తాజా మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. బీఆర్‌ఎస్ పాలన ముగిసేందుకు ఏడాది ముందు నుంచే పంచాయతీల పరిస్థితి అగమ్య గోచరంగా మారడం ప్రారంభమైతే... కాంగ్రెస్ సర్కారు వచ్చాక అదే తీరు కొనసాగుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. నిధుల కేటాయింపులే లేకపోవడంతో పల్లెలో పాలన పడకేసింది. కనీసం గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో పనిభారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది.

జీతాలకూ కొరత

రాష్ర్టంలో మొత్తం 12,769 గ్రామ  పంచాయతీలు ఉండగా ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ ఇచ్చే నిధులే ప్రధాన ఆర్థిక వనరు. కాగా 2022 ఏప్రిల్ నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు రావడం లేదు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల్సి ఉండగా అవీ రాకపోవడంతో పాలన సాగడం లేదు. దీంతో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు కావడంతో జీతాలు సమకూరుతున్నాయి. కానీ చిన్న గ్రామ పంచాయతీలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.

జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆర్నెల్లుగా జీతాలు ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. పంచాయతీ సాధారణ నిధులతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ, పీఎంఎస్ నిధులు జనాభా ప్రతిపాదికన ప్రతి నెల రెండు లక్షల నుంచి 5 లక్షల  వరకు మంజూరయ్యేవి. గ్రామాల్లో వసూలైన ఇంటి పన్నుతో కొన్ని గ్రామాల్లో జీతాలు ఇస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రం జీతాలు ఇవ్వడం కష్టతరంగా మారింది.

ఆదాయం శూన్యం

గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, కార్మికుల వేతనాలు, తాగునీటి సరఫరా నిర్వహణ, విద్యుత్ చార్జీల చెల్లింపు, పారిశుద్ధ్యం తదితర పనుల కోసం నిధులు అందకపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నదని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సుమారు 1,700 మంది జనాభా ఉన్న ఓ గ్రామానికి 2022 మార్చి నెల వర కు నెలనెలా రూ. 1.70 ఎస్‌ఎఫ్‌సీ నిధులు వచ్చేవి. 2022 ఏప్రిల్ నుంచి అవీ రాకపోవడంతో కనీసం అక్కడ పనిచేసే నలుగురు వర్కర్లకు వేతనాలు (ఒక్కక్కరికి రూ.9,500) చెల్లించలేకపోతున్నారు. దీంతో వారు విధుల్లోకి రావడం లేదు. దానికి తోడు ట్రాక్టర్ నిర్వహణకు (ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, డీజిల్ ఖర్చులు) ఏడాదికి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది.

కానీ జీపీలో ఆదాయం మాత్రం శూన్యమని, పంచాయతీని ఎలా నిర్వహించాలో తెలియడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు. దీనికి తోడు జీపీ కరెంట్ బిల్ నెలకు కనీసం రూ.10 నుంచి 30 వేల వరకు వస్తున్నాయని వాటిని చెల్లించకుంటే వీధి దీపాలు కూడ వెలగని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. తాము తాత్కాలికం, నిధులు ఎలా సమకూర్చుకోవాలో మీకే తెలియాలని చెబుతున్నట్లు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందు మీరే తీసుకోవచ్చని, ప్రస్తుతం గ్రామంలోనే ఎవరితోనై సర్దుబాటు చేయం డి అంటూ సలహాలు ఇస్తూ తప్పించుకుంటున్నారని కార్యదర్శులు పేర్కొంటున్నారు. పంచాయతీల్లో 6 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

దొందూ దొందే...

ముఖ్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధుల విడుదల అంతంతమాత్రంగానే సాగింది. 2022 ఏప్రిల్ నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు రాలేదు. ఫలితంగా గ్రామపంచాయతీలపై ఆర్థిక భారం పడింది. నిధులు వస్తాయని ఆశతో గ్రామాల్లో సర్పంచులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాం ముగింపు కంటే ముందుగానే పంచాయతీల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారును విమర్శిస్తుంటే దొందూ దొందే అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.