- భర్త, అత్తామామలకు 20 ఏళ్ల జైలు శిక్ష రద్దు
- బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముంబై, నవంబర్ 9: బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. భార్యను అవమానించడం, టీవీని చూడనివ్వకపోవడం, ఒంటరిగా గుడికి పంపించకపోవడం, నేలపై పడుకునేలా ఒత్తిడి చేయడం వంటి చర్యలు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498ఏ ప్రకారం తీవ్రమైన నేరాలు కావని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే వివాహిత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త, అత్తామామలతోపాటు ఆమె మరిదికి దిగువ కోర్టు విధించిన 20ఏళ్ల జైలు శిక్షను డివిజన్ బెంచ్ కొట్టేసింది. నిందితులపై వచ్చిన ఆరోపణలు గృహ హింసకు సంబంధించినవే తప్ప వాటిని శారీరక, మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది.
మహారాష్ట్రలోని వరంగాన్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు అత్తింటివారిపై కేసు పెట్టారు.
ఈ కేసుపై అక్టోబర్ 17న విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ అత్తింటివారిని దోషులుగా తేల్చుతూ 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును నిందితులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ తాజా తీర్పు వెలువరించింది.