- భార్యను హతమార్చి, ముక్కలు చేసి, కుక్కర్లో ఉడికించిన కసాయి
- ఆపై ముక్కలను చెరువులో పడేసి ఏమీతెలియనట్లు నటన
- అత్తామామలతో కలిసి భార్య కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- మీర్‌పేట వెంకటేశ్వరనగర్ కాలనీలో దారుణం
- పోలీసుల అదుపులో నిందితుడు!
మహేశ్వరం, జనవరి 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన కసాయి భర్త.. ఆపై ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి వాటిని కుక్కర్‌లో ఉడికించి వాటిని జిల్లెలగూడ చందన చెరువులో పడేసిన ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దండుపల్లికి చెందిన ఉప్పాల వెంకటరమణ, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరి పెద్ద కూతురు వెంకట మాధవి(35)ని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన ఆర్మీలో పనిచేసే గురుమూర్తికి ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహాం జరిపించారు. వీరికి ఇద్దరు సంతానం.
ఆర్మీలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన గురుమూర్తి మీర్‌పేట్ వెంకటేశ్వరనగర్ కాలనీలో నివసిస్తూ ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో ఔట్‌సోర్సింగ్ విభాగంలో సెక్యూరీటి గార్డుగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లపాటు కాపురం సజావుగానే సాగిన.. ఆ తర్వాత భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి తరుచూ ఆమెతో గొడవపడి ఆమెను వేధించేవాడు.
పక్కా ప్లాన్ ప్రకారమే..
ఈ క్రమంలో ఈనెల 16న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ముందుగానే భార్య మాధవిని హత్య చేయాలని ప్లానింగ్ వేసుకున్న గురుమూర్తి.. అనుకున్నట్లుగానే ఆమెను హతమార్చి ఆమె శరీర భాగాలను ముక్కలుముక్కలుగా నరికివేశాడు. ఆ తరువాత ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడికించాడు.
అనంతరం ఉడికించిన శరీర ముక్కలను జిల్లెలగూడ చందన చెరువులో పడేసినట్లు ప్రచారం జరుగుతుండగా మరో కోణంలో భార్యను ముక్కలుగా చేసి గ్యాస్ సిలిండర్ సహాయంతో ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా చేసి.. పొడిని బకెట్‌లో తీసుకెళ్లి చందన చెరువులో కలిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇంత చేసిన అనంతరం కూడా అదేరోజు మధ్యాహ్నం నుంచి భార్య మాధవి కనిపించడం లేదని గురుమూర్తి అత్తారింటి వారికి సమాచారం అందించాడు. దీంతో మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ ఈనెల 18న గురుమూర్తితో కలసి తన కూతురు మాధవి కనిపించడం లేదని మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు భర్త గురుమూర్తి పైనే అనుమానం ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాధవి హత్య విషయమై పోలీసులను మీడియా వివరణ కోరగా ఇన్స్‌స్పెక్టర్ కిసర నాగరాజు మాట్లాడుతూ..
మాధవి అదృశ్యం అయినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని.. కేసు దర్యాప్తులో ఉందని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.