27-02-2025 12:21:09 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి ): రంగారెడ్డి జిల్లాలో శివరాత్రి వేడుకలు పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగాయి. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాల బాట పట్టారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మహేశ్వరంలోని శివగంగ రాజ రాజేశ్వర ఆలయం, మైసిగండిలోని శివాలయం రామాలయం, ఆమనగల్ లోని ఐఏసాగర క్షేత్రం, తలకొండపల్లి మండలంలోని మల్లప్ప గుట్ట, షాద్ నగర్ రామేశ్వర గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి, చేవెళ్ల నియోజకవర్గం లోని కోనగట్టు శివాలయం, శంకరపల్లి మండలంలోని మరకత శివాలయం, రాజేంద్రనగర్, శంషాబాద్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఉన్న శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఆయా ఆలయాల వద్ద ఆలయ నిర్వాకులు భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయగా పోలీసులు ప్రత్యేక బంధువులను నిర్వహిస్తున్నారు.
భక్తులతో కిటకిటలాడిన కీసరగుట్ట
ప్రముఖశైవక్షేత్రం మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మేడ్చల్ జిల్లాతో పాటు, హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో కీసరగుట్ట కిటకిటలాడింది. శివనామ స్మరణతో ప్రాంగణం మార్మోగిపోయింది. ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి మంగళ వారం స్వామివారి కల్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేశారు. శివరాత్రి సందర్భంగా 7 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా పోలీసులు దారి పొడవునా తాత్కాలిక డివైడరు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. సి పి సుధీర్ బాబు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు.
పరమశివుడి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): పరమశివుడి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆకాంక్షించారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గల శివాలయాలను ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి ఆలయ పండితులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని పరమశివుడిని కోరుకున్నట్లు తెలుపుతూ ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులలో స్పెషల్ చార్జీల వసూలు
మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు పెద్ద సంఖ్యలో బస్సులను నడిపారు. కానీ ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. ప్రత్యేక బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేశారు. ఈసీఐఎల్ నుంచి 30 రూపాయల చార్జి అయితే, స్పెషల్ బస్సుల పేరిట 60 రూపాయలు వసూలు చేశారు. అంతేగాక డే పాసులను అనుమతించలేదు.
శివనామ స్మరణతో మారుమ్రోగు తున్న శైవ క్షేత్రాలు..
కూకట్ పల్లి ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా కుక్కట్ పల్లి జంట సర్కిల్లో పరిధిలోని పలు శైవ క్షేత్రాలు శివన్నమస్మరణతో మారుమ్రో గుతున్నాయి. బాలానగర్, ఫతేనగర్, కెపిహెచ్బి కాలనీ, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ శివాలయాల లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. శివలింగానికి అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొన్నారు.
కన్నుల పండుగగా కల్యానోత్సవం..
తలకొండపల్లి, ఫిబ్రవరి26 (విజయ క్రాంతి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయితీ లోని మల్లప్పగుట్ట పై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం బుదవారం వేద పండితుల మంత్రోచ్చరణల మద్య కన్నుల పండుగగా జరిగింది.ఈ కల్యానోత్సవంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు పాల్గొన్నారు.
జిల్లాలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
వికారాబాద్, ఫిబ్రవరి 26: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని పలు శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం 12 గంటల నుండి ఆయా శివాలయాల్లో భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకుని ఉపవాసాలు వదిలారు. వికారాబాద్‌లోని బుగ్గ రామలింగేశ్వర శివాల యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ తో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
శివయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో సాక్షాత్తు కైలాస వాసులు పార్వతీ పరమేశ్వరులు కొలువు దీరిన శ్రీ శివగంగా రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఈ పూజలకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.