calender_icon.png 6 October, 2024 | 3:48 AM

కిటకిటలాడిన నవీపేట్ మేకల సంత

06-10-2024 01:11:11 AM

దసరా పండుగ సందర్భంగా జోరుగా జీవాల విక్రయాలు

రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల విలువైన లావాదేవీలు

ఆరు రాష్ట్రాల వ్యాపారుల రాక

నిజామాబాద్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): దసరా నేపథ్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మేకల సంత కిటకిటలాడింది. దాదాపు 20 వేల మేకలు, గొర్రెల అమ్మకాలు జరిగాయి. గతంలో రాష్ట్ర సరిహద్దుల్లోని సాటాపూర్‌లో కొనసాగిన ఈ సంతను 25 ఏండ్ల క్రితం నవీపేట్‌కు తరలించారు.

ఈ సంతకు రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు నుంచి వ్యాపారులు వస్తారు.  ఇక్కడి నుంచి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వారు వచ్చి జీవాల కొనుగోలు చేస్తారు. మామూలు రోజుల్లో పది నుంచి పదిహేను వేల వరకు మేకలు, గొర్రెలు అమ్మకానికి రాగా, దసరా నేపథ్యంలో శనివారం 20 వేలు వచ్చాయి.

మామూలు రోజుల్లో మేక పొట్టేలు రూ.5 వేల నుంచి రూ.7 వేలు పలుకుతుంది. పండగ డిమాండ్‌తో రూ.వెయ్యి నుంచి రూ.౧౫౦౦ వరకు పెంచి అమ్మకాలు జరిపారు. రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పలికే గొర్రె పొట్టెళ్లను సైతం రూ.౧౦౦౦ పెంచి అమ్మారు.

ఈ లెక్కన దాదాపు రూ.7కోట్ల నుంచి 8 కోట్ల వరకు వ్యాపారం జరిగింది.  పంచాయతీ అధికారులు తమ నుంచి సంత పన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, వసతులు కల్పించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, రాత్రి పడుకునేందుకు షెడ్లు నిర్మించాలని కోరుతున్నారు.