- భారీగా వ్రత పూజలు ఆచరించిన భక్తులు
- దర్శనాలకు గంటల తరబడి బారులు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 3 (విజయక్రాంతి): కార్తీక మాసాన్ని పురస్కరిం చుకొని ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. కార్తీకమాసంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు.
దీపావళి వరుస సెలవుల కారణంగా రద్దీ మరింత ఎక్కువైంది. వేకువజాము నుంచే కొండ కింద పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి దీపారదనలు చేశారు. సత్యనారాయణస్వామి వ్రత పూజలు ఆచరించి కొండపై లక్ష్మీనృసింహుడి దర్శనానికి బారులు తీరారు.
ఆదివారం ఒక్కరోజే ఆలయ సన్నిధిలో 723 మంది దంపతులు సత్య నారాయణ స్వామి వ్రత పూజలు ఆచరించారు. ప్రధానాలయంలో లక్ష్మీనృసిం హుడి దర్శనానికి క్యూ లైన్లలో నాలుగు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. కార్తీక భక్తుల రద్దీ సందర్భంగా కొండ కింద పుష్కరిణి, వ్రత మండపం వద్ద ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రముఖుల సందర్శన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. హైకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బంగారు లక్ష్మారెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.