నిర్మల్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి)/ బాసర: బాసర క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వసంత పంచమిని పురస్కరిం చుకొని ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద మంత్రో చ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు శ్రీ మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి అమ్మవార్లను సుప్రభాత సేవ, నిత్యాభిషేకం పూజలు నిర్వహించారు.
పెద్ద మొత్తంలో భక్తులు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లు లేకపోవడంతో కిలోమీటర్ పొడవున భక్తులు బారులు తీరారు. సినీ నిర్మాత దిల్‌రాజ్ తన కుమారుడి అక్షరాభ్యాసం కోసం క్యూలైన్‌లోనే భక్తులను ఆపడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాసర సరస్వతి వసంత పంచమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బాసర వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు.
ఇదిలా ఉండగా వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మిరాజం, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పూజలు నిర్వహించారు.