calender_icon.png 20 September, 2024 | 2:57 PM

నేటి నుంచే క్రాస్ ఎగ్జామినేషన్

20-09-2024 02:29:12 AM

‘కాళేశ్వరం’పై మొత్తం 58 అఫిడవిట్లు దాఖలు 

వీటిలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ అఫిడవిట్ ఒకటి

ఓపెన్ హౌజ్ పద్ధతిలో పీసీ ఘోష్ కమిషన్ విచారణ

తొలుత సాంకేతిక అంశాలు.. 

ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలపై..

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చిన అవినీతి, అక్రమాలు, అవకతవకలను విచారించేందుకు నియమించిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్‌కు ఇప్పటి వరకు 58 అఫిడవిట్లు దాఖలైనట్లు తెలుస్తోంది. వీటిలో గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసి, ఆపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్‌కుమార్ సమర్పించిన అఫిడవిట్ కూడా ఉందని సమాచారం. కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు పలువురు ఇంజినీర్లు, అధికారులు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది. వీటిపై శుక్రవారం నుంచే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగనున్నది.

ముందు సాంకేతిక అంశాలపై..

అఫిడవిట్ ఇచ్చిన వారందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిద్ధమైంది. శుక్రవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నది. మొదట సాంకేతిక అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి, ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో కమిషన్ ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఎగ్జామినేషన్‌కు సర్కార్ ప్రత్యేకంగా ఒక అడ్వకేట్‌ను నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ఆ అడ్వకేట్ పొరుగు రాష్ట్రానికి చెందిన వారని బలంగా వినిపిస్తున్నది. ఆర్థిక పరమైన అంశాల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించే నాటికి ఓ సీనియర్ చార్టెర్డ్ అకౌంటెంట్‌ను సైతం నియమించే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఈసారి 25 మంది విచారణ..

కమిషన్ ఇప్పటికే మొత్తం 15 మంది ఇంజినీర్లు, అధికారులను విచారించింది. ఈసారి సుమారు 25 మందిని విచారించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా ఇంజినీర్లు, అధికారులు అఫిడవిట్లు సమర్పించారని, వాటిలో పేర్కొన్న అంశాలపై ఓపెన్‌హౌజ్ ఎంక్వైరీ పద్ధతిలో విచారిస్తున్నదని సమాచారం. దీనిలో భాగంగా శుక్రవారం ఏడుగురిని విచారించే అవకాశం ఉందని, వీరిలో చీఫ్ ఇంజనీరు స్థాయి అధికారులతో పాటు రీసెర్చ్ నిపుణులు, పరిపాలన అధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది.