- ప్రజలు, రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు
- మహారాష్ట్రకు తరలింపు
- నెలకు రూ.కోట్లలో దందా?
- లక్షల్లో అధికారులకు ముడుపులు!
హనుమకొండ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. ఈజీ మనీకి అలవాటు పడిన మాయగాళ్లు ముఠాగా ఏర్పడి అక్రమదందాను నిర్వహిస్తున్నారు. హసన్‌పర్తికి చెందిన ఓ సాధారణ వ్యక్తి నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం అక్రమదందాకు తెరతీశాడు.
వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాలతో పాటు ఎల్కతుర్తి, ములకనూరు ప్రాంతాలకు తన దందాను విస్తరించాడు. ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి 13 వరకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రజల నుంచి రేషన్ బియ్యం సేకరించడం ఈ ముఠా పని. రేషన్ డీలర్ల నుంచి కూడా పెద్దమొత్తంలో బియ్యం సేకరించి హసన్‌పర్తి మండలంలోని ఓ రహస్య ప్రదేశంలో డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ ముఠా కిలోకు రూ.17 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆ విధంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని వ్యాపారికి కిలోకు రూ.25 చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్లు తెలిసింది.
ప్రతిరోజు 5-6 లారీలు..
ప్రతిరోజు 5 నుంచి 6 లారీల్లో లోడ్ చేసి మహారాష్ట్రలోని గోండియా, బాల్‌ఘాట్‌కు తరలించి కోట్ల రూపాయాలు దండుకుంటున్నట్లు సమచారం. హసన్‌పర్తి మీదుగా ఎల్కతుర్తి సమీపంలోని వే బ్రిడ్జి వద్దకు చేర్చిన అనంతరం అప్పటికే ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న మహారాష్ట్ర బ్యాచ్ ఆ లారీలను తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మాదిరిగా రోజుకు 150 టన్నులకు పైగా బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విజిలెన్స్ అధికారులు ఈ ముఠా అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. పక్కా సమాచారం మేరకు రేషన్ బియ్యంతో జిల్లా సరిహద్దులు దాటుతున్న లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కానీ స్థానికంగా ఉన్న పలుకుబడితో ఆ ముఠాలోని ప్రధాన నిందితుడు తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మామూళ్ల మత్తులో అధికారులు
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమదందా యథేచ్ఛగా నడుస్తుండగా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ముఠా నుంచి నెలవారీగా ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నట్లు ప్రచారంలో ఉంది.
హనుమకొండ, కాజీపేట, వరంగల్ సబ్ డివిజన్‌లకు చెందిన పలువురి అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్ విభాగానికి చెందిన కొంతమంది అధికారులకు నెలవారీగా మామూళ్లు ఇచ్చుకుంటు న్నట్లు సమాచారం. ఏసీపీ స్థాయి అధికారికి రూ.లక్ష, సీఐకి రూ.50 వేలు, ఎస్సైలకు రూ.30 వేలు, సిబ్బందికి రూ.20 వేల చొప్పున రేటు నిర్ణయించి ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.