calender_icon.png 20 September, 2024 | 3:28 AM

400 కోట్లు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

19-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వంలో కొందరు సినీ నటు డు నాగార్జునను రూ.400 కోట్లు డిమాం డ్ చేశారని, ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు నోముల భగత్, దాసోజ్ శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఫామ్‌హౌజ్‌లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సాగేది సుపరిపాలన కాదని దరిద్రపు పాలన అని విమర్శించారు.

ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం రూ.17,933 కోట్లు మాత్రమేనని, ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయ నేది ఇంత వరకు ప్రకటించలేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం హైడ్రా డ్రామాలు, అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీది ఒక విధానం, రేవంత్‌రెడ్డి ఇంకో విధానం పాటిస్తున్నారని విమర్శించారు.

హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ తమ్మడికుంట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టిన సిపాయి హిమాయత్‌సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ప్రజాపాలన నడవటం లేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారని, కేసీఆర్, కేటీఆర్‌తోపాటు మా నాయకుల వ్యక్తిత్వాల మీద సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ టీమ్ లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని కేసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా తాను వదిలి పెట్టనని హెచ్చరించారు.